లోక్సభ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికలలో కలసి పోటీ చేయడానికి సంబంధించి అధికార బిజూ జనతా దళ్ , భారతీయ జనతా పార్టీ మధ్య సీట్ల సర్దుబాటు చర్చలు ముందుకు సాగలేదు. ఈ రెండు పార్టీలు రానున్న ఎన్నికలలో ఎవరికి వారే ఒంటరిగా పోటీ చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. రెండు కీలక నియోజకవర్గాలైన భువనీశ్వర్, పూరీపై ఏర్పడిన విభేదాలను పరిష్కరించడంలో శనివారం ఢిల్లీలో జరిగిన చర్చలు విఫలమయ్యాయి. ఒడిశాలోని మొత్తం 147 అసెంబ్లీ నియోజకవర్గాలు, 21 లోక్సభ నియోజకవర్గాలలో బిజెపి తన అభ్యర్థులను నిలబెడుతుందని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమాల్ ప్రకటించేశారు.
.సీట్ల పంపకాలపైనే రెండు పార్టీల మధ్య విభేదాలు తలెత్తాయి. ఎన్నికలకు ముందుగానే సీట్ల సర్దుబాటు చేసుకోవాలని రెండు పార్టీలు తొలుత భావించినప్పటికీ సీట్ల పంపకాల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదని తెలుస్తోంది. 147 అసెంబ్లీ స్థానాలలో 100కి పైగా స్థానాలలో పోటీ చేస్తామన్న బిజెడి ప్రతిపాదనను బిజెపి వ్యతిరేకించినట్లు తెలుస్తోంది. ఒడిశాలోని 21 లోక్సభ స్థానాలలో 14 స్థానాలను తమకు కేటాయించాలని బిజెపి పట్టుపట్టినట్లు తెలుస్తోంది. దీనికి బిజెడి ససేమిరా అన్నట్లు వర్గాలు తెలిపాయి.
రెండు పార్టీల మధ్య ఏకాభిప్రాయం రానందున చర్చలలో ప్రతిష్ఠంభన ఏర్పడినట్లు వారు చెప్పారు. కాగా..2019 లోక్సభ ఎన్నికలలో బిజెడి 12 స్థానాలలో గెలుపొందగా బిజెపి 8 స్థానాలను గెలుచుకుంది. నవీన్ పట్నాయక్.. వరుసగా గెలుస్తూ వస్తున్నారు. ఇప్పటికీ ఒడిషాలో బీజేడీనే గెలుస్తుందన్న అభిప్రాయం ఉంది. కాంగ్రెస్ బలహీనపడినా.. బీజేపీ పుంజుకోలేకపోయింది. గెలిచేంత స్థాయిలో లేదు. అయినా నవీన్ పట్నాయక్ ఎప్పుడూ ఢిల్లీ రాజకీయాల జోలికి రాలేదు. బీజేపీకే మద్దతుగా ఉంటున్నారు. అయితే అమిత్ షా జోక్యం చేసుకుంటే పొత్తులు ఉండవచ్చన్న అభిప్రాయం వినిపిస్తోంది.