బద్వేలులో పోటీ చేసేది లేదని అనంతపురంలో జరిగిన సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసేన పోటీ చేయడానికి ఆసక్తిగా ఉందని ప్రచారం జరిగింది. అయితే అక్కడ చనిపోయిన ఎమ్మెల్యే సుబ్బయ్య భార్య సుధకే వైసీపీ టిక్కెట్ ఇచ్చినందున విలువల్ని పాటిస్తామంటూ పవన్ కల్యాణ్ ప్రకటించారు. నిజానికి గత ఎన్నికల్లోనూ జనసేన అక్కడ పోటీ చేయలేదు. బీఎస్పీకి మద్దతిచ్చారు. కానీ నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చాయి. బీజేపీ పరిస్థితి అంతే. ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పోటీ చేయకపోవడమే మంచిదని పవన్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.
అయితే భారతీయ జనతా పార్టీ మాత్రం పోటీచేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడగకుండానే మద్దతు ప్రకటిస్తే చిన్నతనం అవుతుంది. జనసేన ఇప్పటికే మద్దతు ప్రకటించింది. ఈ క్రమంలో తాము ఏం చేయాలన్నదానిపై సోము వీర్రాజు జాతీయ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. పోటీ చేయాల్సిందేనని వారు చెప్పినట్లుగా తెలుస్తోంది. దీంతో వారు ఇతర పార్టీల్లో చురుకుగా పని చేసి ప్రస్తుతం సైలెంట్‌గా ఉన్న కొంత మంది నేతల్ని పోటీ కోసం సంప్రదిస్తున్నారు.
బీజేపీ పోటీ చేసినా జనసేన మద్దతివ్వడం మాత్రం సాధ్యం కాదు. ఎందుకంటే పవన్ కల్యాణ్ డాక్టర్ సుధకే మద్దతిస్తున్నట్లుగా చెప్పారు. దివంగత ఎమ్మెల్యే భార్య కాబట్టి పోటీ చేయడం లేదని చెప్పడం నేరుగా మద్దతివ్వడం కిందకే వస్తుంది.ఇప్పుడు మిత్రపక్షం పోటీ చేసినా జనసేన మద్దతు ఇవ్వదన్నమాట. అంటే ఓ రకంగా మిత్రులు ఇప్పుడు విడిపోయారని అర్థం చేసుకోవాలి. రెండు పార్టీల మధ్య ఇటీవల పెరిగిపోయిన గ్యాప్ … బద్వేలు ఉపఎన్నిక మరింత పెంచే అవకాశం ఉంది.