తిరుపతి లోక్సభ ఎన్నికల్లో బీజేపీ -జనసేన కూటమి తరపున భారతీయ జనతా పార్టీ అభ్యర్థే రంగంలో ఉంటారు. ఈ విషయాన్ని బీజేపీ ఏపీ వ్యవహారాల ఇంచార్జ్ మురళీధరన్ ట్వీట్ చేశారు. కేంద్ర మంత్రి కూడా అయిన మురళీధరన్ ప్రస్తుతం కేరళ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉన్నారు. ఈ సమయంలో తీరిక చేసుకుని.. తిరుపతి అభ్యర్థి గురించి ప్రకటన చేశారంటే.. జనసేన కూడా అంగీకరించి ఉంటుందని భావిస్తున్నారు. ఈ మేరకు జనసేన, ఏపీ బీజేపీ అగ్రనేతలందరూ కలిసి జరిపిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లుగా మురళీధరన్ ప్రకటించారు. గ్రేటర్ ఎన్నికల్లోనూ బీజేపీ కోసం పోటీ నుంచి వైదొలిగిన జనసేన.. తిరుపతిలోనూ అదే దారి పట్టడంతో జనసైనికులు నిరాశకు గురవుతున్నారు. స్థానిక ఎన్నికల్లోనూ బీజేపీ కన్నా.. జనసేన ఎన్నో రెట్లు ఎక్కువ ఫలితాలను పొందింది. అయినప్పటికీ.. జనసేన సీటును బీజేపీకి త్యాగం చేసింది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్తో పాటు ఉపఎన్నికల షెడ్యూల్ కూడా విడుదలవుతుందని అనుకున్నారు కానీ.. బీజేపీ కసరత్తులు పూర్తి కాలేదని అనుకున్నారో ఏమో కానీ.. విడిగా ప్రకటిస్తామని.. ఈసీ ప్రకటించింది. మొత్తంగా ఎనిమిది విడతల పోలింగ్ జరగనుంది. ఈ పోలింగ్లో ఏదో ఓ దశలో… తిరుపతి , నాగార్జునసాగర్ ఉపఎన్నికల పోలింగ్ కూడా జరుగుతుంది. ఆ ప్రకారం షెడ్యూల్ విడుదలవుతుంది. తిరుపతిలో వైసీపీ ఎంపీ కరోనా కారణంగా చనిపోవడంతో ఉపఎన్నికలు వచ్చాయి. తాము పోటీ చేస్తామని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఉత్సాహపడ్డారు. చివరికి… వెనక్కి తగ్గినట్లుగా ఉన్నారు. ఇటీవల పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.
స్టీల్ ప్లాంట్ ఉద్యమంతో పాటు అనేక అంశాలు.. బీజేపీ-జనసేన కూటమికి ఇబ్బందికరంగా మారాయి. అక్కడ జనసేన పోటీ చేస్తేనే… ఓ వర్గం మద్దతు ఇస్తామని నిర్ణయం తీసుకున్నట్లుగా కూడా ప్రచారం జరిగింది. చివరికి బీజేపీనే పోటీ చేయాలని నిర్ణయించుకుంది. గత ఎన్నికల్లో అక్కడ బీజేపీకి ఏడు నియోజకవర్గాల్లో కలిపి ఇరవై వేల ఓట్లు కూడా రాలేదు. ఈ సారి మాత్రం.. గెలిచి చూపిస్తామని.. బీజేపీ నేతలు ప్రకటనలు చేస్తున్నారు.