గోదావరి జలాలను శ్రీశైలానికి తరలించాలనీ, తద్వారా తెలంగాణ ఆంధ్రా రాష్ట్రాలకు అదనంగా నీటిని వినియోగించుకునే అవకాశం ఉంటుందనే ప్రతిపాదన సూత్రప్రాయంగా తెరమీదికి వచ్చిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఓ దఫా సమావేశమై ఈ ప్రాజెక్టుపై చర్చించారు. ప్రస్తుతం అధికారుల స్థాయిలో చర్చల ప్రక్రియ జరుగుతోంది. అయితే, నదీ జలాల పంపకం అనేది ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించుకుంటే సరిపోతుందా, కేంద్రం జోక్యం ఉంటుంది కదా అనే సందేహాలు మొదట్నుంచీ వ్యక్తమౌతున్నవే. అయితే, గోదారి జలాల తరలింపు ప్రతిపాదనలపై ఇంతవరకూ భాజపా నాయకులు ఎవ్వరూ మాట్లాడలేదు. కానీ, ఇప్పుడు తొలిసారిగా స్పందించారు ఏపీ భాజపా నాయకురాలు దగ్గుబాటి పురంధేశ్వరి. ఈ వ్యవహారంలోకి కేంద్రం ఎంట్రీ ఉంటుందని సంకేతాలు ఇచ్చారు!
నదీ జలాల పంపకం అనేది రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడేసి నిర్ణయాలు తీసుకుంటే సరిపోదని వ్యాఖ్యానించారు పురంధేశ్వరి. నదీ జలాల పంపకం అనేది ఎప్పుడో జరిగినపోయిన వ్యవహారమనీ, దీనిపై ఇప్పుడు కొత్తగా చర్చలు పెట్టడం సరికాదన్నారు. తెలంగాణ, ఆంధ్రాల మధ్య కూడా ట్రిబ్యునల్ ద్వారా నీటి పంపకాలు ఎప్పుడో పక్కాగా జరిగిపోయాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో గోదావరి నదీ జలాలను పంపకం చేయాలంటే ప్రజాభిప్రాయం తీసుకోవాల్సి ఉంటుందనీ, పరీవాహక ప్రాంతాల్లోని రైతుల అభిప్రాయాలకు ప్రాధాన్యత కల్పించాల్సి ఉంటుందనీ వీటిపై సీఎం జగన్మోహన్ రెడ్డి దృష్టి సారించాలన్నారు పురంధేశ్వరి! ఇది కేవలం రెండు రాష్ట్రాలకు సంబంధించి వ్యవహారంగా చూడకూడదన్నారు.
సో… ముఖ్యమంత్రులిద్దరూ డ్రీమ్ ప్రాజెక్టు అనుకుంటున్న గోదావరి జలాల తరలింపు వ్యవహారంలోకి కేంద్రం ఎంట్రీ ఉంటుందనేది పురంధేశ్వరి చెప్పకనే చెప్పారు అనొచ్చు. ప్రజాభిప్రాయం ఉండాలంటున్నారు. నిజానికి, ఇది రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంశంగానే ఇద్దరు సీఎంలూ భావించి, ముందుకెళ్తున్న పరిస్థితి. సాంకేతికంగా, చుట్టుపక్కల రాష్ట్రాలు, కేంద్రాన్ని పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. గత భాజపా ప్రభుత్వంలో కావేరీ-గోదావరి నదులను అనుసంధానం చేయాలనే ప్రదిపాదనను తెరమీదికి నాటి కేంద్రమంత్రి నితిన్ గట్కరీ తెచ్చారు. దాన్ని తెలుగు రాష్ట్రాలు పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందని నిపుణులు అంటున్నారు. మొత్తానికి, ఈ వ్యవహారంలోకి కేంద్రం ఎంట్రీ ఉంటుందనడానికి పార్టీ మాటగా పురంధేశ్వరి సంకేతాలు ఇచ్చారనే చెప్పాలి.