ఎంపి పెళ్లి సుబ్బి చావుకు వచ్చినట్టు తెలంగాణ ముఖ్యమంత్రికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి మధ్య నడుస్తున్న ద్వంద్వ క్రీడ తమకు తలనొప్పిగా మారిందని రాష్ట్ర బిజెపి నేతలు వాపోతున్నారు. చాలా విషయాల్లో తమ ముఖ్యమంత్రుల కంటే ముందుగా ఎక్కువగా కెసిఆరే పొగడ్తలు కురిపిస్తారు.మళ్లీ అంతలోనే విమర్శలతో విరుచుకుపడతారు. స్థానికంగా మాకు అసలే ప్రాధాన్యత ఇవ్వకపోగా మజ్లిస్‌ను నెత్తిన పెట్టుకుంటారు. ఇన్ని మల్లగుల్లాల మధ్య మేం ఏం చేయాలన్నది చాలా చికాకైన చిక్కుముడిగా వుంటోందని రాష్ట్ర బిజెపి కీలక నేత ఒకరు వివరించారు. నోట్లరద్దు జిఎస్టి వంటి వాటిపై బిజెపి ప్రభుత్వాల కన్నా ముందే ఈయన ఎగిరెగిరి బలపర్చారు. ఢిల్లీ వెళ్లి మోడీజీని కలిసి వచ్చారు. మళ్లీ ఇప్పుడు నష్టం అంటున్నారు.అప్పుడు 28 శాతం జిఎస్టి అంటే కాదు 18 శాతం చాలని తానే సూచించినట్టు చెప్పిన కెసిఆర్ ఇప్పుడు అది భారమంటే ఎలా? అదే నిజమైతే మేమూ పోట్లాడతాము. కాని వూరికే రాజకీయావసరాల కోసం బ్లోహాట్ బ్లోకోల్డ్లా కోపతాపాలైతే ఎలా అని ఆ నాయకుడు ప్రశ్నించారు. ఒక విషయంలో మాత్రం బిజెపి నేతలకు క్లారిటీ వచ్చేసింది. రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి ఎన్నికలు అయిపోయాయి గనక ఇక టిఆర్ఎస్ అధినేత దూకుడును అదేపనిగా భరించనవసరం లేదని మాత్రం నిర్ణయించుకున్నారట. కాని ఇంతలోనే కేంద్రం వివరణ ఇచ్చి కెసిఆర్‌ను శాంత పరచినట్టు మరో కథనం. సో..దాగుడు మూతలు ఇంకా ఆగిపోలేదన్న మాటే కదా?