కేంద్ర ప్రభుత్వం పేదలకు పంచాలని బియ్యం పంపిస్తే ఏపీ ప్రభుత్వం నొక్కేసిందని .. పేదలకు పంపిణీ చేయడం లేది ఢిల్లీలో బీజేపీ నేత జీవీఎల్ నరసింహారావు ఆరోపించారు. దీంతో ఏపీ ప్రభుత్వ వర్గాలు ఉలిక్కి పడ్డాయి. నిజానికి కేంద్రం పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని రాష్ట్రాలకు ఇచ్చింది. రాష్ట్రాలు పంపిణీ చేస్తాయి. కానీ.. ఏపీ మాత్రం పంపిణీ చేయలేదు. కరోనా కారణంగా ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ యోజన పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయించింది. 2022 మార్చితో ఉచిత పంపిణీ ముగిసినప్పటికీ కేంద్రం మరో ఆరు నెలలు పొడిగించింది.
వైట్ రేషన్ కార్డులో ఉన్న ప్రతి సభ్యుడికి నెలకు 5 కిలోల వంతున పంపిణీ చేయాలి. కేంద్రం ఠంచన్‌గా బియ్యం పంపిణీ చేస్తున్నా రెండు నెలలుగా ఏపీ ప్రభుత్వం పేదలకు ఇవ్వడంలేదు. ఏప్రిల్ నెలలో సరిపడా బియ్యం నిల్వలు లేవని, సాంకేతిక ఇబ్బందులు ఉన్నాయంటూ చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు కేంద్రం తక్కువ కోటా ఇస్తోందని, అందుకే బియ్యం పంపిణీ చేపట్టలేదని వాదిస్తోంది. ఇప్పుడు బీజేపీ నేతలు, జీవీఎల్ ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు.
పేదల రేషన్ బియ్యాన్ని నొక్కేస్తున్నారని మండిపడుతున్నారు. అయితే కేంద్రం ఇచ్చేది.. తమ దగ్గర ఉన్న లెక్క ప్రకారం..కానీ రాష్ట్రంలో వైట్ రేషన్ కార్డులు కేంద్రం లెక్క కన్నా డబుల్ ఉన్నాయి. అందరికీ ఇవ్వకుండా కొందరికే ఇస్తే… మిగతా వారిలో అసంతృప్తి వస్తుంది. అందరికీ ఇవ్వాలంటే తమకు ఖర్చవుతుందని ప్రభుత్వం ఆగిపోతోంది. ప్రజల ఫ్రీ బియ్యాన్ని తానే ఉంచేసుకుంటోంది .