భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు సోము వీర్రాజు.. అంతన్నారు.. ఇంతన్నారు కనీసం సర్పంచ్ స్థానాలు కూడా గెలిపించలేకపోయారు. తొలి విడతలో జరిగిన మూడు వేలకుపైగా పంచాయతీల్లో భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు మూడు అంటే మూడు గ్రామాల్లో సర్పంచ్‌లుగా గెలిచారు. భారతీయ జనతా పార్టీ ఈ స్థానిక ఎన్నికల్లో పూర్తిగా తేలిపోయింది. స్టేట్ పార్టీలో కింగులమని చెప్పుకుని మీడియా ముందు చెలరేగిపోయే నేతల సొంత గ్రామాల్లోనూ వారికి ఓట్లు పడలేదు. చివరికి సోము వీర్రాజు స్వగ్రామంలోనూ బీజేపీ అభ్యర్థి గెలిచినట్లుగా లేదు. ఒకప్పుడు.. ఆయన తన స్వగ్రామంలో వార్డు మెంబర్‌గా పోటీ చేసి ఓడిపోయారు ..అది వేరే విషయం. అయితే… వారి సైజుకు.. చేస్తున్న ప్రకటనలకు… రాజకీయానికి పొంతన లేకుండా పోయింది.
జనసేన పార్టీ… ప్రధాన పార్టీలతో పోటీ పడకపోవచ్చు కానీ.. కొన్ని చోట్ల తన బలాన్ని ప్రభావవంతంగానే చూపించింది. దాదాపుగా ఇరవై ఎనిమిది గ్రామాల్లో జనసేన అభ్యర్థులు సర్పంచ్ స్థానాలను గెల్చుకున్నారు. వీటిలో అత్యధిక తూర్పుగోదావరి జిల్లాలోనే ఉన్నాయి. అయినప్పటికీ… బీజేపీ కంటే తన పార్టీనే బలమైందని.. నిరూపించగలిగారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో చూసినా ఇదే పరిస్థితి. బీజేపీ పోటీ చేస్తే.. కనీసం పోటీలో ఉంటుందో లేదో కూడా చెప్పడం కష్టమని.. ప్రస్తుత ఫలితాలు నిరూపిస్తున్నాయి. జనసేన పోటీ చేస్తేనే ఇంతో ఇంతో… పోటీ పడటానికి చాన్స్ ఉంటుందని ఎవరికైనా అర్థం అవుతుంది.
అయితే బీజేపీ నేతలు మాత్రం తిరుపతి సీటు తమకే కావాలని పట్టుబడుతున్నారు. అమిత్ షా దగ్గర్నుంచి జేపీ నడ్డా వరకూ.. అందరితోనూ పవన్ కల్యాణ్‌కు ఓ మాట చెప్పిస్తున్నారు. దాంతో పవన్ కల్యాణ్ కరిగిపోతున్నారు. బీజేపీ గెలవాల్సిన అవసరం ఉందంటూ.. ఆయన కూడా పోటీ నుంచి తప్పుకుంటున్నారు. జనసేన పార్టీకి జరుగుతున్న నష్టాన్ని ఆయన అంచనా వేస్తున్నారో లేదో తెలియడంలేదు కానీ… పంచాయతీ ఎన్నికల ఫలితాల తర్వాతైనా… పవన్ తన పార్టీ గురించి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. త్యాగాలు చేసుకుంటూ పోతే… జనసేన బలంతో బీజేపీ బలపడుతుంది. చివరికి జనసేనను పూచిక పుల్లలా తీసి పడేస్తుంది. బీజేపీ జాతీయ స్ట్రాటజీ అదే. పవన్ ముందే మేలుకోవాల్సి ఉంది.