ఆంధ్ర ప్రదేశ్లో ప్రత్యేకహౌదాతో సహా అనేక సమస్యల మధ్య తెలుగుదేశంతో ఏ మేరకు సంబంధాలు కొనసాగించాలో తోచక బిజెపి గజిబిజి పడుతున్నది.కాని తెలంగాణలో ఆ బెడదలేకుందా దూకుడుగా ముందుకుపోవాలని భావిస్తున్నది. అందులోనూ ఇటీవల డా.కె.లక్ష్మణ్ అద్యక్ష పదవి చేపట్టిన తర్వాత అధికారాన్నే లక్ష్యంగా చేసుకుని ముందుకు పోవాలని నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు బిజెపికి చాలా పరిమిత బలమే వుంది కదా అంటే.. అసోంలో అయిదు స్ఘానాలు, హర్యానాలోనూ అన్నే స్థానాలు వుండేవి. అయినా అక్కడ అధికారానికి రాలేదా? తెలంగాణలోనూ మా బలం ఇలాగే వుంటుందని ఎందుకు అనుకుంటున్నారు?అని బిజెపి నేతలు ప్రశ్నిస్తున్నారు.పైగా ఇటీవల ఆ పార్టీ అద్యక్షుడు అమిత్షా అధికారం రావాలన్నా ఆధిక్యత పెరగాలన్నా అమీతుమీ తేల్చుకోవడానికి సిద్ధం కావాలి. అటూ ఇటూ గాకుండా వుంటే కుదర్దు అని బోధించి పంపించారట.మొన్న రైతుల సమస్యలపై కరీంనగర్ లో బిజెపి ధర్నాను ప్రభుత్వం విఫలం చేయడం వీరు గట్టిగా ఎదుర్కోవడం చూస్తే అమిత్ షా వ్యూహం అమలులో పెట్టినట్టే కనిపించింది. పైగా లక్ష్మణ్ ఇంకా పూర్తిగా కుదురుకోకముందే ముఖ్యమంత్రి కెసిఆర్ కొత్తబిచ్చగాడు పొద్దెరగడన్నట్టు చేస్తున్నారని ఎగతాళి చేయడం బిజెపికి ఆగ్రహం తెప్పించింది.
తెలుగుదేశంతో పొత్తు లేకుంటే బిజెపికి ఇప్పుడున్న స్థానాలు కూడా వచ్చివుండేవి కావు. అయితే పొత్తువల్ల తాము నష్టపోయామనే బిజెపి నేతలు అనుకుంటున్నారు.ఓటుకు నోటు తర్వాత ఆ అప్రతిష్ట తాము కూడా పంచుకోవలసిన వచ్చిందంటున్నారు.టిఆర్ఎస్తో మెతక వైఖరి ప్రసక్తే లేదని తామే ప్రధాన ప్రతిపక్షంగా పోరాడతామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. మరి దీనంతటి వల్ల ఫలితం దక్కుతుందా అంటే అధికారం రావడం అంత సులభం కాదని మాత్రం చెప్పొచ్చు.