వచ్చే ఏడాది జరుగనున్న ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో భాజపా ఒంటరిగానే పోటీ చేస్తుందని కేంద్ర మంత్రి మహేష్ శర్మ చెప్పారు. గత ఎన్నికలలో తమ పార్టీకి 71 సీట్లు గెలుచుకొందని వచ్చే ఎన్నికలలో 265 సీట్లు గెలుచుకొని రాష్ట్రంలో కూడా అధికారంలోకి వస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణం జరగాలని కోట్లాది ప్రజలు కోరుకొంటునప్పటికీ, దానిని భాజపా ఎన్నికల అజెండాలో చేర్చబోమని అన్నారు. ఒకవేళ ముఖ్యమంత్రి అభ్యర్ధిగా భాజపా తనను నిలబెట్టాలనుకొంటే అది తనకు అంగీకారమేనని చెప్పారు.
రామాలయ నిర్మాణం తమ అజెండాలో ఉండబోదని చెపుతున్నప్పటికీ, ఆ ప్రస్తావన చేస్తున్నారంటే దానర్ధం ఆ అంశాన్ని ఎన్నికలలో భాజపా తప్పకుండా ఉపయోగించుకొనే ఉద్దేశ్యం ఉన్నట్లుగా భావించవచ్చు. అయితే ప్రస్తుతం భాజపాయే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా రామాలయ నిర్మాణానికి అది పూనుకోవడం లేదు కనుక, ఆ విషయంలో దాని మాటలను ప్రజలు విశ్వసించకపోవచ్చు. బహుశః అందుకే ఆ అంశాన్ని ఎజెండాలో చేర్చమని చెపుతున్నారేమో?
ఉత్తర ప్రదేశ్ లో ప్రస్తుతం సమాజ్ వాదీ పార్టీ అధికారంలో ఉంది. దానికి ములాయం సింగ్ నేతృత్వం వహిస్తుంటే, ఆయన కొడుకు అఖిలేష్ యాదవ్ ముఖ్యమంత్రిగా ఉన్నారు. కనుక వారిరువురూ మళ్ళీ తమ పార్టీయే అధికారంలోకి రావాలని కోరుకోవడం సహజమే. అందుకు వాళ్ళు కూడా ఇప్పటి నుంచే గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీతో కొన్ని షరతులతో పొత్తులకి సిద్దమని వాళ్ళు ప్రకటించారు.
కానీ కాంగ్రెస్ పార్టీకి వాళ్ళ షరతు (2019 సార్వత్రిక ఎన్నికలలో యూపిఏ కూటమి ములాయం సింగ్ ని ప్రధాని అభ్యర్ధిగా ప్రకటించడం) అంగీకారం కాకపోవడంతో, అది ప్రధాన ప్రతిపక్షం బి.ఎస్.పి.తో కలిసి కానీ లేదా ఒంటరిగా గానీ పోటీ చేయాలనుకొంటోంది.
ఇంక బి.ఎస్.పి. అధినేత్రి, మాజీ ముఖ్యమంత్రి మాయావతి, వచ్చే ఎన్నికలలో తప్పకుండా గెలిచి మళ్ళీ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవాలని తహతహలాడుతున్నారు. లేకుంటే ఇంక ఆమె పార్టీ మనుగడ సాగించడం చాలా కష్టమవుతుంది. కనుక కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి సిద్దపడవచ్చు.
సమాజ్ వాదీ ప్రస్తుతం అధికారంలో ఉండటం, స్థిరమైన ముస్లిం ఓటు బ్యాంక్ కలిగి ఉండటం దానికి కలిసివచ్చే అంశం. బి.ఎస్.పి.కి బలహీనవర్గాలలో మంచిపట్టు కలిగిఉండటం దానికి సానుకూలమైన అంశం. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దాంతో చేతులు కలిపినట్లయితే అది నిస్సందేహంగా ఒక బలమైన కూటమి అవుతుంది.
గతంలో నరేంద్ర మోడీకి, నితీష్ కుమార్ కి విజయం సాధించడానికి కారకుడైన ఎన్నికల వ్యూహనిపుణుడు ప్రశాంత్ కిషోర్ ఈసారి కాంగ్రెస్ పార్టీ విజయం కోసం పనిచేయబోతున్నారు. ఈ పరిస్థితులలో భాజపా ఒంటరిగా పోటీ చేయాలనుకొంటే, అది మిగిలిన అన్ని పార్టీలను ఎదుర్కొని గెలవవలసి ఉంటుంది. బిహార్ లో ఇలాగే ఒంటరిపోరుకి దిగి భాజపా భంగపడింది. కనుక ఒంటరి పోరాటం చేయాలనుకొంటే, భాజపా అందుకు చాలా చెమటోడ్చక తప్పదు. కానీ ఉత్తర ప్రదేశ్ ఎన్నికలలో ఓడిపోతే ఆ ప్రభావం 2019 సార్వత్రిక ఎన్నికలపై కూడా పడే ప్రమాదం ఉంటుంది.