మహారాష్ట్ర, హర్యానాల్లో జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి తిరుగులేదని ఎగ్జిట్ పోల్స్ తీర్పు వెల్లడించాయి. రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీకి ప్రత్యర్థులే లేరని.. ఏకపక్ష విజయాలు ఖాయమని దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. 288 స్థానాలున్న మహారాష్ట్ర అసెంబ్లీలో బీజేపీ- శివసేన కూటమికి సగటున రెండు వందల స్థానాలు ఖాయమని… అన్ని సంస్థలు లెక్కలేశాయి. న్యూస్ 18 సంస్థ అత్యధిగా… బీజేపీ – శివసేన కూటమికి 243 స్థానాలొస్తాయని ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. న్యూస్ ఎక్స్ సంస్థ అతి తక్కువగా.. కూటమికి 150 స్థానాల వరకూ రావొచ్చని వెల్లడించింది. ఎలా చూసినా… బీజేపీ కూటమికి భారీ విజయం ఖాయమని స్పష్టమయింది. మహారాష్ట్రలో ప్రస్తుతం బీజేపీ – శివసేన కూటమినే అధికారంలో ఉంది.
హర్యానాలోనూ.. ఎగ్జిట్ పోల్స్ అదే తరహా ఫలితాన్ని ఇచ్చాయి. ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ మరింత పట్టు పెంచుకుంటుందని తేల్చాయి. తొంభై స్థానాలున్న హర్యానా అసెంబ్లీలో బీజేపీకి 70 నుంచి ఎనభై స్థానాలు వస్తాయని… టైమ్స్ నౌ, ఇండియా న్యూస్, న్యూస్ ఎక్స్ ప్రకటించాయి. రెండో స్థానంలో నిలిచే కాంగ్రెస్ పార్టీకి పది నుంచి పన్నెండు సీట్ల వరకూ రావొచ్చని అంచనా వేశాయి. హర్యానాలో బలంగా ఉన్న ప్రాంతీయ పార్టీలు అయిన ఐఎన్ఎల్డీ-అకాలీదల్ ఘోరంగా దెబ్బతినే అవకాశం ఉంది రెండు రాష్ట్రాల్లోనూ అధికార వ్యతిరేకత లేనే లేదని… ఏమైనా ఉన్నా.. మోడీ మానియాలో కొట్టుకుపోయాయని… ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేశాయి.
రెండు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీ దూకుడైన రాజకీయం చేసింది. ఇతర పార్టీలను బలహీనం చేసేందుకు పెద్ద ఎత్తున నేతల్ని చేర్చుకున్నారు. ఆ రాజకీయాన్ని ఇతర పార్టీలు తిప్పికొట్టలేకపోయాయి. కాంగ్రెస్ పార్టీ.. అంతర్గత రాజకీయాలతో.. పోటీ ఇవ్వలేని స్థితికి మొదటగానే చేరింది. దాంతో బీజేపీకి గెలుపు సులువయిందని ఎగ్జిట్ పోల్స్ నిర్ణయించాయి.