ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో అమీతుమీ తలపడేందుకు సిద్ధమవుతున్న భారతీయ జనతా పార్టీ.. ఓ విభిన్నమైన వ్యూహంతో తెర ముందుకు రాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఏపీ సర్కార్.. పాలనా పరమైన.. తప్పులు చేస్తూ.. ప్రజల్లో చులకన అయిందని భావిస్తున్న బీజేపీ… రాజకీయాల కోసం.. ప్రజల్ని బలిపెట్టేందుకు కూడా.. ఈ సర్కార్ వెనుకాడదని నిరూపించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. దీనికి .. కృష్ణా వరదలే సాక్ష్యమని అంటున్నారు. ఈ వరదలను.. ఓ ప్రణాళిక ప్రకారం.. రాజధాని గ్రామాలపైకి పంపాలని చూశారని.. దానికి సంబంధించి.. పక్కా ఆధారాలు ఉన్నాయి కాబట్టి… కేంద్ర ప్రభుత్వంతో విచారణ చేయించాలన్న ఆలోచన చేస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు లేకపోయినా .. ఎగువ ప్రాంతాల్లో వర్షాల కారణంగా… ఏపీలో వరద వచ్చింది. ఆల్మట్టి నుంచి ప్రకాశం బ్యారేజీ వరకూ.. నీరు రావడానికి.. కనీసం వారం రోజులుపైగానే పడుతుంది. ఎంత ఎంత వరద వస్తుందో… కేంద్ర జలసంఘం.. ఎప్పటికప్పుడు… ప్రభుత్వాలకు పంపుతుంది. కేంద్ర జలసంఘం ఎలాంటి జాగ్రత్తలు .. ఎక్కడెక్కడ తీసుకోవాలో కూడా సూచనలు చేస్తుంది. అలాంటి సూచనలు.. కేంద్ర జల సంఘం నుంచి ఆంధ్రప్రదేశ్ సర్కార్‌కు వచ్చాయి. కానీ వాటిని నిర్లక్ష్యం చేశారు. శ్రీశైలం నిండే వరకూ నీటిని విడుదల చేయలేదు. అదే సమయంలో రాయలసీమకు తరలించాల్సి ఉన్నా ఆలస్యం చేశారు. ప్రకాశం బ్యారేజీని ఖాళీ చేయాలని కేంద్ర జలసంఘం అదేశించిన మూడు రోజుల వరకూ… నీళ్లు వదల్లేదనే ఆరోపణలు ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ బీజేపీ ఈ అంశాన్నే కీలకంగా తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ముఖ్యంగా… బీజేపీ ఎంపీ సుజనా చౌదరి.. ఈ వరదల అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటున్నారు. గతంలో.. వరదలను కావాలనే ముంపు కోసం వాడుకున్నారని ఆరోపించారు. ఇప్పుడు… ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ.. వరదలపై విచారణ జరిపించాల్సి ఉందని.. మనసులో మాట బయట పెట్టారు. కృష్ణా వరదల్లో ముంపురాజకీయం జరిగిందని.. ఫ్లడ్ మేనేజ్మెంట్ చేసే పద్ధతి వేరుగా ఉంటుందని… కానీ అలాంటిది జరగలేదంటున్నారు. గేట్లు ఎత్తడానికి ఎందుకు ఆలస్యమైందో తేలాలంటే.. వరద మీద విచారణ చేయాల్సిన అవసరం ఉందంటున్నారు. సుజనా.. ఈ విషయంలో.. కేంద్ర సర్కార్ పై ఒత్తిడిపెంచితే విచారణ ఖాయంగా జరుగుతుందన్న అభిప్రాయం ఉంది.