భారతదేశంలో… రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు వచ్చే ఓట్లు ఇంచు మించుగా యాభై శాతం ఉంటాయి. 1991 నుంచి ఇప్పటి వరకూ..జరిగిన ఎన్నికలు, వాటి ఓటింగ్ సరళిని పరిశీలిస్తే.. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్‌లకు కలిపి యాభై శాతం మాత్రమే ఓట్లు వస్తున్నాయి. మిగతా ఓట్లు అన్నీ ఇతర ప్రాంతీయ పార్టీలకు.. చిన్న చిన్న పార్టీలకు వెళ్తున్నాయి. మొదటి నుంచి చూస్తే.. జాతీయ పార్టీలు బలహీన పడుతూ వస్తున్నాయి. ప్రాంతీయ పార్టీలు బలం పుంజుకుంటూ వస్తున్నాయి. గత ఎన్నికలలో భారతీయ జనతా పార్టీకి పూర్తి స్థాయిమెజార్టీ వచ్చినా.. ఓట్ల శాతం మాత్రం 31 మాత్రమే. అందుకే ప్రాంతీయ పార్టీలే.. దేశ రాజకీయాల్లో కీలకంగా మారుతున్నాయి.
వందకుపైగా సీట్లు కోల్పోనున్న బీజేపీ.. !
ఉపఎన్నికల ఫలితాలు, వెల్లడవుతున్న సర్వేలను బట్టి.. భారతీయ జనతా పార్టీ చాలా ఈజీగా వంద కంటే ఎక్కువ సీట్లను కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో బీజేపీ ఉత్తరప్రదేశ్‌లో 71 లోక్‌సభ స్థానాలను గెలిచింది. కానీ ఈ సారి అక్కడ పది నుంచి ఇరవై స్థానాలను కూడా గెలుపొందడం కష్టమేనని.. ఇటీవల జరిగిన ఉపఎన్నికల ఫలితాలు వెల్లడించాయి. గత ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, చత్తీస్ గఢ్ లాంటి రాష్ట్రాల్లో బీజేపీ ఏపక్ష విజయాలను నమోదు చేసింది. ఒకటి రెండు.. మినహా మిగతా లోక్ సభ స్థానాలన్నింటినీ కైవసం చేసుకుంది. కానీ ఈ సారి మాత్రం పరిస్థితి అలా లేదు. హిందీ మాట్లాడే అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీకి భారీగా సీట్లు తగ్గనున్నాయి. సర్వేలు కూడా అదే చెబుతున్నాయి.
విపక్షాలన్నీ కలసిన చోట బీజేపీకి చెక్..!
ఉత్తరప్రదేశ్‌లో ఎవరు గెలిస్తే వారికి కేంద్రంలో అధికారం అందుతుంది. కారణం ఏదైనా.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ గెలిచే పరిస్థితి లేదు. ఎస్పీ, బీఎస్పీ, ఆర్ఎల్డీ, కాంగ్రెస్ పార్టీలు కూటమిగా మారడంతో అక్కడ బీజేపీకి వ్యతిరేకంగా ఓట్లు సమీకృతమయ్యాయి. ఆ ఫలితాలు… ఉపఎన్నికల్లో కనిపించాయి. మిగతా చోట్ల కూడా అదే పరిస్థితి. మహారాష్ట్రలోని పాల్ఘర్లో విపక్ష పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేశాయి. అక్కడ మాత్రమే బీజేపీ గెలిచింది. అదే మహారాష్ట్రలోని అదే సమయంలో జరిగిన గోండియా పార్లమెంట్ స్థానం ఉపఎన్నికలో కాంగ్రెస్, ఎన్సీపీ కలసి పోటీ చేశాయి. పలితంగా ఆ స్థానం ఎన్సీపీ గెలుచుకుంది. దీని ద్వారా తెలిసిందేమింటే.. విపక్షాలన్నీ కలసి కట్టుగా ఉన్న చోట బీజేపీ ఓడిపోయింది.
ఎవరు బలంగా ఉంటే వారిపై ప్రాంతీయ పార్టీల పోరాటం..!
రెండు ప్రధాన పార్టీల ఓటింగ్‌ను పక్కన పెడితే మిగతా యాభై శాతం ఓట్లు ప్రాంతీయ పార్టీలకు వస్తున్నాయి. కానీ ఈ ప్రాంతీయ పార్టీలకు స్పష్టమైన విధానం లేదు. రాజకీయ అవసరాలకు అనుగుణంగానే తమ విధానాలు మార్చుకుంటూ వస్తున్నాయి. చంద్రబాబు, మమతా బెనర్జీ బీజేపీతో స్నేహం చేశారు. విడిపోయారు. ఇప్పుడు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అలా చాలా పార్టీలు… జాతీయ పార్టీలతో మార్చి మార్చి స్నేహం, శతృత్వం … కొనసాగిస్తూనే ఉన్నాయి. కేంద్రంలో బీజేపీ బలంగా ఉంటే.. ఆ పార్టీపైన… కాంగ్రెస్ బలంగా ఉంటే .. ఆ పార్టీపైనే పోరాడి… ఫలితాలను సాధిస్తున్నాయి. నిజానికి ఒకప్పుడు ప్రాంతీయ పార్టీలన్నీ కాంగ్రెస్‌ను తీవ్రంగా వ్యతిరేకించేవి. ఎందుకంటే.. అప్పట్లో.. కాంగ్రెస్ పార్టీ వాటికి ప్రధాన ప్రత్యర్థిగా ఉండేది. కానీ ఇప్పుడు కొద్ది రాష్ట్రాల్లో కాంగ్రెస్ ప్రధాన ప్రత్యర్థిగా ఉంటోంది. కాంగ్రెస్ తో పోటీ పడే ఏ పార్టీ కూడా.. ఆ పార్టీకి ఫేవర్‌గా ఉండటానికి సిద్ధపడదు. ఎక్కువగా.. బీజేపీనే .. ఆయా రాష్ట్రాల్లో ప్రధాన ప్రత్యర్థిగా ఉంది కాబట్టి… ఎక్కువ మంది కాంగ్రెస్ తో కలిసి నడిచే విషయంలో ఇబ్బంది లేనట్లుగా వ్యవహరిస్తున్నారు.
ఓట్ల లెక్కలతో బీజేపీని ఓడించడం సాధ్యం కాదు..!
విపక్షాల ఐక్యత వల్ల భారతీయ జనతా పార్టీ ఓడిపోతుందన్నది నిజం. విపక్షాలన్నీ కలవడం వల్ల.. ఈ విజయం దక్కుతోంది. అయితే ఇవన్నీ తాత్కాలికమే. విపక్ష పార్టీలన్నీ సైద్ధాంతికంగా బలమైన బంధాన్ని ఏర్పాటు చేసుకుని బీజేపీ పోరాడితేనే అంతిమ విజయం దక్కుతుంది. కేవలం ఓట్ల లెక్కలతో… చేసే ప్రయత్నాలేవీ సుదీర్ఘ కాల ఫలితాలను ఇవ్వవు. ఎందుకంటే… బీజేపీ ఓడిపతోంది కానీ… పడిపోవడం లేదు. బీజేపీ ఓటింగ్ శాతం… కొద్దికొద్దిగా పెరుగుతూనే ఉంది. కానీ గత ఎన్నికల్లో బీజేపీ ఎక్కడైతే గెలిచిందో.. అక్కడ వెనుకబడిపోయింది. ఎక్కడ గెలవలేదో.. అక్కడ బలపడే ప్రయత్నం చేస్తోంది. బెంగాల్, ఒడిషా, కేరళల్లో ఆ పార్టీకి ఓట్లు కొద్దికొద్దిగా పెరుగుతూనే ఉన్నాయి. బీజేపీ ఇప్పుడు అధికారంలో ఉంది… బలహీనపడుతోందన్న సూచనలున్నాయి కాబట్టే.. విపక్ష పార్టీలు వ్యతిరేకంగా గళం వినిపిస్తున్నాయి. ఒక వేళ బలపడుతోదని అనిపిస్తే.. ఆ పార్టీల తీరు ఎలా ఉంటుందో చెప్పలేం. అందుకే సిద్ధాంతపంరగా… బీజేపీకి ఎదుర్కొనేందుకు ప్రయత్నించాలి.
ప్రాంతీయ పార్టీలకే అత్యధిక సీట్లు..!
భారతీయ జనతా పార్టీ ఇప్పుడున్నట్లుగానే… పతనం అవుతూ వెళ్తే కాంగ్రెస్ కన్నా.. ఎక్కువగా ప్రాంతీయ పార్టీలే లాభపడతాయి. కాంగ్రెస్ పార్టీ… మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక లాంటి రాష్ట్రాల్లో మాత్రమే బీజేపీతో హోరాహోరీ తలపడుతోంది. ఉత్తరప్రదేశ్ సహా మిగతా అన్ని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు.. ఇతర పార్టీలే పోరాడుతున్నాయి. అందుకే…వాటి సమైక్యత వాటికి కలసి వచ్చే అవకాశం ఉంది. కానీ అంతిమ విజయం సాధించాలంటే.. మాత్రం సీట్లు, ఓట్లు ప్రాతిపదికగా మాత్రం సాధ్యం కాదు. సిద్ధాంతపరంగా… కలసికట్టుగా సమరం చేస్తేనే.. గెలుస్తారు. లేదంటే.. మళ్లీ బీజేపీ చేతిలో ఓడిపోతారు.