“తెలంగాణాలో తెరాసకి భాజపాయే ప్రత్యామ్నాయం. తెరాసని ఎదుర్కోగల శక్తి భాజపాకే ఉంది. వచ్చే ఎన్నికలలో తెరాసతో సహా మరే పార్టీతో పొత్తులు పెట్టుకోకుండానే భాజపా పోటీ చేసి అధికారంలోకి వస్తుంది. తెరాస ప్రభుత్వ హనీమూన్ పీరియడ్ ముగిసింది. దాని పట్ల ప్రజలలో వ్యతిరేకత మొదలైంది. తెరాసపై యుద్ధం ఆరంభించి భాజపా సత్తా ఏమిటో దానికి రుచి చూపించబోతున్నాము,” అని అన్నారు భాజపా ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు.
అమిత్ షా క్రిందటిసారి హైదరాబాద్ వచ్చినప్పుడు తెరాస ఇష్టపడితే ఎన్డీయే కూటమిలో చేర్చుకొని కేంద్రమంత్రి పదవి ఇస్తామని ప్రకటించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ వెంటనే స్పందిస్తూ “మీతో స్నేహం మాకు అక్కరలేదు..మీరిచ్చే కేంద్రమంత్రి పదవీ మాకు అక్కరలేదు.మమ్మల్ని ఇలాగ ప్రశాంతంగా బ్రతకనివ్వండి,”అని ఘాటుగా జవాబు చెప్పారు.
భాజపాకి ఇటువంటి చేదు అనుభవాలు మహారాష్ట్ర, జమ్ము కాశ్మీర్, తమిళనాడు, బిహార్, రాష్ట్రాలలో కూడా ఎదురయ్యాయి. ఇప్పుడు చాలా రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీల ప్రభావమే ఎక్కువగా ఉంది కనుక వాటితో పొత్తులు లేనిదే కాంగ్రెస్, భాజపాలు ఒంటరిగా పోటీచేసి గెలవలేని పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఇటీవల నాలుగు రాష్ట్రాలలో జరిగిన శాసనసభ ఎన్నికలే అందుకు చక్కటి ఉదాహరణ. ఆ సంగతి గ్రహించింది కనుకనే భాజపా తెలంగాణాలో తెరాసతో పొత్తులు పెట్టుకావాలని ప్రయత్నించి భంగపడింది.
‘అందని ద్రాక్ష పళ్ళు పుల్లన’ అన్నట్లు భాజపాతో పొత్తులు పెట్టుకోని కారణంగా తెరాస చెడ్డదయిపోయింది. పొత్తులకి తెరాసయే అంగీకరించలేదని చెప్పుకోవడం భాజపాకి నామోషీగా ఉంటుంది కనుక, తెరాసతో పొత్తులు పెట్టుకోబోమని మురళీధర్ రావు చెపుతున్నారు. తమిళనాడులో భాజపాతో పొత్తులకి అంగీకరించని జయలలిత (అన్నాడిఎంకె), కెప్టెన్ విజయ కాంత్ (డిఎండికె) పార్టీలపై ఎన్నికల సమయంలో ఏవిధంగా యుద్ధం చేసిందో, తెలంగాణాలో కూడా తెరాసపై అదే విధంగా యుద్ధం చేయడానికి భాజపా సిద్దం అవుతోంది. అక్కడ ఎన్నికల సమయంలో పొత్తులకి ప్రయత్నించి భంగపడింది. తెలంగాణాలో ఎన్నికలకి ఇంకా మూడేళ్ళ సమయం ఉండగానే తెరాసతో పొత్తులకి ప్రయత్నించి భంగపడింది. అంతే తేడా!