ఆంధ్రా పాలకులు, ఆంధ్రా పార్టీలు… ఈ మాటల్ని అవసరమొచ్చినప్పుడు ఎలా ప్రయోగించాలో సీఎం కేసీఆర్ కి బాగా తెలుసు! ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం టీడీపీని టార్గెట్ చేసుకుని… తెలంగాణ పాలన అంతా చంద్రబాబు చేతుల్లోకి వెళ్లకుండా కాపాడుకోవాలంటూ ప్రచారం చేశారు. ఆంధ్రా ట్యాగ్ లైన్ తో సెంటిమెంట్ రెచ్చగొట్టి, రాజకీయ ప్రయోజనాలను ఎప్పటికప్పుడు రాబట్టుకుంటూ వచ్చారు. అయితే, ఏపీలో జగన్ సీఎం అయిన తరువాత కేసీఆర్ వైఖరి మారిపోయింది. ఆంధ్రా పార్టీలు, ఆంధ్రా పాలకులు అనే మాటల్ని తగ్గించేశారు. ఒక ప్రాంతానికి చెందిన పార్టీ, నాయకుల్ని విమర్శించడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు ఎలా పొందొచ్చో అనే సూత్రాన్ని కేసీఆర్ ఎలా వాడుకున్నారో, ఇప్పుడు భాజపా కూడా అదే తరహా సెంటిమెంట్ రాజేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తోంది.
టీటీడీ బోర్డు మెంబర్ల పదవుల నియామకం చూస్తుంటే ఆంధ్రా సీఎం జగన్ తో కేసీఆర్ మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకున్నట్టుగా ఉందని ఆరోపించారు భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్. కేసీఆర్ బంధువులు ముగ్గురుకి టీటీడీ బోర్డులో జగన్ నియమించారన్నారు. రాష్ట్రంలో కేసీఆర్ కుటుంబ పాలన అనడానికి ఇది మరో ఉదాహరణ అన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి ఆంధ్రా నీళ్లు తీసుకుని వెళ్లిపోతుంటే, కేసీఆర్ ఎందుకు అడ్డుకునే ప్రయత్నం చేయలేదని ప్రశ్నించారు. మీకు నీళ్లు, మాకు పదవులు అన్నట్టుగా కనిపిస్తోందన్నారు. ఇది ఆంధ్రా పాలకులతో చేసుకున్న మ్యాచ్ ఫిక్సింగ్ లా ఉందన్నారు. తెలంగాణ అవసరాలను ఆంధ్రాకి తాకట్టుపెడుతున్నట్టున్నారని ఆరోపించారు. వివేక్ మాత్రమే కాదు, ఆంధ్రా పాలకులతో తెరాస దోస్తీ అంటూ లక్ష్మణ్ తోపాటు ఇతర భాజపా నేతలు కూడా ఈ మధ్య వివిధ సందర్భాల్లో విమర్శలు చేస్తున్నారు.
తెలంగాణలో పార్టీ బలపడాలంటే గతంలో కేసీఆర్ వాడినట్టే, ఇప్పుడు భాజపా కూడా ఈ సెంటిమెంట్ ను నెమ్మదిగా తెర మీదికి తెస్తున్నట్టుగా కనిపిస్తోంది. తెలంగాణ ప్రయోజనాల పేరుతో గతంలో తెరాస విమర్శలు చేసిన పంథాలోనే వివేక్ విమర్శలున్నాయి. అయితే, గతంలో తెరాస వాడినంత స్థాయిలో దీన్ని భాజపా ఇప్పుడు ఏ మేరకు చర్చనీయం చేయగలదో చూడాలి. నిజానికి, ఈ తరహా విమర్శలూ ఎత్తుగడలూ వ్యూహాల వల్ల నాయకుల రాజకీయ ఎదుగుదలే తప్ప, వాస్తవంలో ప్రజలకు ఒనగూరే ప్రయోజనాలు ఏవీ ఉండవు. ప్రజలను భావోద్వేగాలకు గురి చేసి ప్రయోజనం పొందాలనుకునే వ్యూహం అన్ని సందర్భాల్లో వర్కౌట్ కాదు.