భాజపా ఆపరేషన్ ఎలా ఉంటుందో చిదంబరం విషయంలో చూస్తూనే ఉన్నాం! గతంలో చిదంబరం హోంమంత్రిగా ఉన్నప్పుడు అమిత్ షా మీద చర్యలు తీసుకుంటే… ఇప్పుడు అమిత్ షా హోంమంత్రి అయ్యారు కాబట్టి చిదంబరంపై చర్యలకు దిగారు అన్నట్టుగా పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా, ఒక లక్ష్యాన్ని భాజపా నిర్దేశించుకుందీ అంటే సామ దాన భేద దండోపాయాలు అన్నీ ఉపయోగిస్తుంది. ఇప్పుడు తెలంగాణపై ఆ పార్టీ దృష్టి ఉన్న సంగతి తెలిసిందే. కేసీఆర్ పాలనలో చాలా అవినీతి జరిగిందనీ, దాన్ని వెలికి తీస్తామని టి.నేతలు ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటున్నారు. ఇప్పుడు తెలంగాణలో భారీ విద్యుత్ కుంభకోణం జరిగిందని మరో అంశాన్ని తెరమీదికి తెచ్చారు పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్.
రాష్ట్రంలో భారీ విద్యుత్ కుంభకోణం జరిగిందనీ, దాన్ని బయటకి రాకుండా ముఖ్యమంత్రి కేసీఆర్ జాగ్రత్త పడుతున్నారని ఆరోపించారు లక్ష్మణ్. జాతీయ సోలార్ విధానంలో టెండర్లు పలిచినట్టు పిలిచీ, కమిషన్లకు కక్కూర్తిపడి దాన్ని పక్కనపడేశారన్నారు. 4 రూపాయల 30 పైసలకు యూనిట్ విద్యుత్ ఇస్తామని ముందుకొచ్చినవారిని కాదని, 5 రూపాయల 50 పైసలకు ఇతర కంపెనీలతో ఒప్పందాలను కేసీఆర్ సర్కారు కుదుర్చుకుందన్నారు. తక్కువ ధరకు వస్తుంటే కాదని, ఎక్కువ ధరకు ఎందుకు ఒప్పందాలు కుదుర్చుకున్నారో కేసీఆర్ చెప్పగలరా అని ప్రశ్నించారు? తాము చేస్తున్న ఆరోపణలపై ఒక సిట్టింగ్ జడ్డితో విచారణ జరిపించగలరా, ఈ కుంభకోణం అవాస్తవం అని కేసీఆర్ నిరూపించగలరా అంటూ సవాల్ చేశారు. దేశంలోనే అత్యంత అసమర్థ విద్యుత్ సంస్థ ఇండియా బుల్స్ అనీ, అయినా రాష్ట్ర ప్రభుత్వం ఆ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందనీ, ఇప్పటివరకూ ఒక్క యూనిట్ కూడా అక్కడి నుంచి వచ్చింది లేదన్నారు.
రాష్ట్రంలో ఇలాంటి స్కాములపై త్వరలోనే కేంద్రం దృష్టి సారిస్తుందని సంకేతాలు ఇచ్చారు లక్ష్మణ్. విద్యుత్ ఒప్పందాలపై లక్ష్మణ్ ఇంత సవివరంగా కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారు. ఈ ఆరోపణలపై కేసీఆర్ సర్కారు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏదేమైనా, కేసీఆర్ సర్కారును ఇరుకునపెట్టేందుకు కావాల్సిన ఆరోపణల్ని ఒక్కోటిగా రెయిజ్ చేస్తూ ఉన్నారు భాజపా నేతలు. ఇప్పటికిప్పుడు విచారణల్లాంటివి ఉంటాయేమో తెలీదుగానీ… వారి రాజకీయాల అవసరాలున్నాయని అనుకున్నప్పుడు ఇలాంటి ఆరోపణలపై చట్టం తనపని తాను చేయడం మొదలుపెట్టేస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు కదా!