రాజాసింగ్ ను భరించడం కష్టమన్న అభిప్రాయానికి బీజేపీ మరోసారి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. ప్రతీ దానికి ఆయన దూకుడుగా స్పందిస్తున్నారు. ఇతర పార్టీ నేతల్ని వదిలి పెట్టడం లేదు. తాజాగా కొంత మంది ఫాల్తూగాళ్లు పార్టీని వదిలిపెట్టి పోతే అధికారంలోకి వస్తామని కామెంట్స్ చేశారు. సొంత పార్టీ సీనియర్ నేతలపై ఆయన ఇలా మాట్లాడటం చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేస్తోంది.
ఇంతకు ముందు ఆయన మత విద్వేషాలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారన్న ఆరోపణతో బీజేపీ కూడా హైకమాండ్ కూడా స్పష్టం చేసింది. బీఆర్ఎస్ హయాంలో చాలా కాలం జైల్లో ఉన్నారు. బయటకు వచ్చాక కూడా బీజేపీ ఆయనపై సస్పెన్షన్ ఎత్తివేయలేదు. అనేక ప్రయత్నాలు చేసిన తర్వాత ఎన్నికలకు ముందు అతి కష్టం మీద ఆయన సస్పెన్షన్ ఎత్తివేసి టిక్కెట్ ఇచ్చారు. అయినా ఆయన తీరు మారలేదు.
పార్టీలో పనులు చేయించుకోవాలనుకున్నా.. తన వారికి ప్రాధాన్యత దక్కాలన్నా ఆయన బెదిరింపుల మార్గాన్నే ఎంచుకుంటున్నారు. ఇప్పుడు పార్టీ నేతలపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సీనియర్లకు రుచించడం లేదు. పార్టీ తెలంగాణ అధ్యక్షుడ్ని ప్రకటించనున్న తరుణంలో ఆయన తీరుపై హైకమాండ్ కూడా గుర్రుగానే ఉంది. ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది.