దేశవ్యాప్తంగా బీజేపీ పరిస్థితిపై ఉపఎన్నికల ఫలితాలు మరోసారి నిరూపించాయి. పార్లమెంట్ ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టబోయిన పరిస్థితిని బీజేపీ తెచ్చుకుంది. మరో నెలన్నరలోపే ఉపఎన్నికల్లో గట్టి షాక్ తగిలింది. దీంతో బీజేపీ పరిస్థితి రాను రాను దిగజారిపోతోందన్న అంచనాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ప్రదర్శిస్తున్నట్లుగా ముందు ముందుగా మేకపోతు గాంభీర్యం ప్రదర్శించవచ్చు కానీ.. మరో నాలుగై నెలల్లో జరగాల్సిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల తర్వాత పరిస్థితి ఎలా ఉంటుదో అంచనా వేయడం కష్టం అవుతోంది .
మహారాష్ట్రలో బీజేపీ చేసిన రాజకీయం కారణంగా అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. అది పార్లమెంట్ ఎన్నికల్లో బయటపడింది. బీజేపీ పుణ్యమా అని.. అక్కడ రెండు శివసేన పార్టీలు, రెండు ఎన్సీపీ పార్టీలు ఉన్నాయి. నిజానికి రెండు ప్రాంతీయపార్టీలను చీల్చి వాటి డూప్లికేట్స్ కు అసలైన హోదా ఇప్పిస్తే.. అసలైన పార్టీలు అంతర్ధానం అయిపోవు. ప్రాంతీయ పార్టీలు ఆధారపడేది ఓ నేత మీద లేదా కుటుంబం మీద. వేరే వారికి ఆ పార్టీని కట్టబెట్టినంత మాత్రాన ప్రజలు మారిపోరు. ఇప్పుడుఅదే మహారాష్ట్రలో కనిపిస్తోంది. ఉద్దవ్ నేతృత్వంలోని అసలైన శివసేన, శరద్ పవార్ నేతృత్వంలోని అసలైన ఎన్సీపీ మళ్లీ పట్టు నిరూపించుకున్నాయి.
వచ్చే ఎన్నికల్లో ప్రణాళికాబద్దంగా పోటీకి కాంగ్రెస్, శివసేన, ఎన్సీపీ ఇప్పటికే చర్చలు జరుపుకుంటున్నాయి. షిండే ప్రభుత్వంపై ప్రజల్లో సానుకూలత లేదని పార్లమెంట్ ఎన్నికలు నిరూపించాయి. ఆ మూమెంట్ ను పూర్తి స్థాయిలో క్యాచ్ చేసుకుని జెండా పాతాలని కాంగ్రెస్ కూటమి గట్టి ప్రయత్నం చేస్తోంది. సర్వేలు కూడా.. ఈ సారి అక్కడ బీజేపీ రాజకీయాల కారణంగా ఘోరంగా దెబ్బతినబోతోందని చెబుతున్నారు. అందుకే ఏడాది చివరిలో జరగనున్న మహారాష్ట్ర ఎన్నికల తర్వాత బీజేపీకి మరింత కఠిన పరిస్థితి ఎదురుకానుంది. వచ్చేఏడాది ఢిల్లీ , బీహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు తేడా వస్తే రాజకీయం మారిపోతుంది. అందుకే బీజేపీ ఇప్పుడు మరింత కేర్ ఫుల్ గా పరిపాలన చేయాల్సి ఉంది.