హరివంశ్ వర్సెస్ హరిప్రసాద్. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవి కోసం పోటీ పడుతున్నది ఈ ఇద్దరే. హరివంశ్ జేడీయూ ఎంపీ. ఆయనకు బీజేపీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. హరిప్రసాద్ కాంగ్రెస్ ఎంపీ, ఆయనకు కాంగ్రెస్, మిత్రపక్షాలతో పాటు కొన్ని తటస్థ పార్టీలు మద్దతు పలికాయి. విపక్ష పార్టీల తరపున అభ్యర్థిని నిలబెట్టేందుకు ఎస్పీ, బీఎస్పీ, తృణమూల్ కాంగ్రెస్ ఆసక్తి చూపించలేదు. కాంగ్రెస్ తన అభ్యర్థిని నిలబెడితే సంపూర్ణ మద్దతు ప్రకటిస్తామని హామీ ఇచ్చాయి. దీంతో ఆ పార్టీ హరిప్రసాద్ పేరును ఖరారుచేసింది. ఆయన నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు ఎన్డీయే అభ్యర్థిగా జేడీయూ ఎంపీ హరివంశ్ నారాయణ్ కూడా నామినేషన్ వేశారు.
బీకే హరిప్రసాద్ కర్ణాటకకు చెందిన వారు. గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక జరగనుంది. సంప్రదాయం ప్రకారం.. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవిని విపక్షాలకు ఇవ్వాలి. కానీ బీజేపీ మాత్రం తమ కూటమి చేతుల్లోనే ఉండాలని నిర్ణయించుకుంది . పూర్తి మెజార్టీ లేకపోయినా పోటీకి సిద్దమయింది. ప్రస్తుతం
రాజ్యసభలో 244 మంది సభ్యులున్నారు. ఈ ఎన్నికలో మెజార్టీ సాధించాలంటే 123 ఓట్లు అవసరం. ముగ్గురేసి సభ్యులున్న శివసేన, అకాలీదళ్, తొమ్మిది మంది సభ్యులు ఉన్న బీజేడీ ఓటింగ్‌కు గైర్హాజరవుతారన్న ప్రచారం జరుగుతంది. వీరు ఓటింగ్ కు రాకపోతే… గెలుపునకు కావాల్సిన మ్యాజిక్ ఫిగల్ 115కు తగ్గుతుంది.
అకాలీదళ్, శివసేనను లెక్క నుంచి తీసేస్తే.. ఎన్డీఏ బలం 110 మాత్రమే అవుతుంది. వైసీపీ బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా ఓటేస్తామని ప్రకటించింది. టీడీపీ ఇప్పటికే బీకే హరి ప్రసాద్ కు మద్దతు ప్రకటించింది. ఈ రెండు పార్టీలతో కలుపుకుని తమకు 119 మంది సభ్యుల బలం ఉందని కాంగ్రెస్ చెబుతోంది. అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్, మెహబూబా ముఫ్తీకి చెందిన పీడీపీ, డీఎంకే కూడా కాంగ్రెస్ అభ్యర్థికే ఓటు వేయనున్నారు. ప్రస్తుత పరిస్థితిని చూస్తే బీజేపీకి గడ్డు పరిస్థితే ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.