గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల వేడి సద్దుమణిగింది. ఇంక మేయర్ సీటు ఎంపిక ఉంది. ప్రస్తుత పాలకవర్గానికి ఫిబ్రవరి వరకు సమయం ఉండటంతో అప్పటి వరకూ సైలెంట్‌గా ఉంటారు. ఈ లోపు… టీఆర్ఎస్, బీజేపీ మరో అంశంపై యాక్టివ్ అయ్యాయి. అదే గ్రేటర్ వరంగల్ ఎన్నికలు. గ్రేటర్ వరంగల్ ఎన్నికల్ని కూడా మార్చిలోపు నిర్వహించాల్సి ఉంది. జనవరి లేదా ఫిబ్రవరి మొదటి వారంలో గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్ఎస్ భావిస్తోది. ప్రస్తుత పాలకవర్గం పదవీకాలం 2021 మార్చి 11వ తేదీతో ముగుస్తుంది.
హైదరాబాద్‌లో మంచి ఫలితాలు రావడంతో బీజేపీ నేతలు ముందుగానే వరంగల్‌పై దృష్టి పెట్టారు. కిషన్ రెడ్డి ఓ సారి వరంగల్‌లో పర్యటించి అక్కడి ప్రాంత అభివృద్ధికి.. తెలంగాణ సర్కార్ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని ఆరోపణలు గుప్పించారు. స్మార్ట్ సిటీగా కేంద్రం గుర్తించి వందల కోట్లు ఇస్తోందని ప్రకటించుకున్నారు. బీజేపీ ఎక్కడ పాగా వేయాలనుకుంటే ముందుగా అక్కడికి వెళ్లి కేంద్ర నిధుల గురించి ప్రచారం చేసుకుంటుంది. ఇక్కడా అదే వ్యూహం ప్రారంభించింది. అయితే టీఆర్ఎస్ కూడా ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. పురపాలక మంత్రిగా కేటీఆర్ వరుస సమీక్షలు చేస్తున్నారు. ఎన్నికలకు వెళ్లే ముందు ప్రజల్ని సంతృప్తి పరిచేలా… హామీల్ని అమలు చేయాలని నిర్ణయించుకున్నారు. జనవరి నుంచి వరంగల్ ప్రజలకు రోజూ మంచి నీరు ఇచ్చే ఏర్పాట్లు చేశారు.
గత గ్రేటర్ వరంగల్ ఎన్నికలకు ముందు కేసీఆర్ ప్రత్యేకంగా నగరంలో పర్యటించి పెద్ద ఎత్తున వరాలు ప్రకటించారు. అవేమీ కార్యాచరణ వరకు వచ్చినట్లుగా స్పష్టత లేదు. దీంతో.. ఆ పనుల్లో వేగం పెంచాలని నిర్ణయించారు. టీఆర్ఎస్కు ఇక్కడా వరద గండం ఉంది. హైదరాబాద్ కంటే ముందే… వరంగల్ వరదలతో అతాలకుతలం అయింది. కానీ ప్రజలకు ఎలాంటి సాయమూ ప్రకటించలేదు. హైదరబాద్‌లో రూ. పదివేలు పంచారు. ఆ విషయం ప్రజల మనసుల్లో రిజిస్టర్ అయింది. దీన్ని బీజేపీ ఉపయోగించుకుంటోంది. తెలంగాణ రాష్ట్ర నూతన పురపాలక చట్టం ప్రకారం మూడు నెలల ముందుగా లేదా మూణ్నెళ్ల తర్వాత నిర్వహించుకునే వీలుంది. దీంతో ప్రభుత్వం ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఎన్నికలు పెట్టడానికి అవకాశం ఉంది. ఈ లోపు మాత్రం వరంగల్‌లో రాజకీయ పర్యటనలు … సవాళ్లు ఊపందుకునే చాన్స్ ఉంది.