తెలంగాణలో బీజేపీ,టీఆర్ఎస్ మధ్య కరోనా రాజకీయం అంతకంతకూ ముదురుతోంది. కరోనా కట్టడిలో తెలంగాణ సర్కార్ విఫలమయిందని… బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా విమర్శలు చేయడంతో రేగిన సెగ…ఆ పార్టీ నేతలు..ఆస్పత్రుల ముందు ధర్నా చేయడంతో పెరిగిపోయింది. టీఆర్ఎస్ నేతలు… వారికి ఘాటైన కౌంటర్లు ఇస్తున్నారు. ఇప్పటి వరకూ కరోనా కట్టడి చర్యల్లో తీరిక లేకుండా గడుపుతున్న ఆరోగ్య మంత్రి ఈటల రాజేందర్ కు ఇప్పుడు బీజేపీకి కూడా సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో వరుసగా ఆయన ప్రెస్మీట్లు పెట్టి బీజేపీపై విరుచుకుపడుతున్నారు. రెండు రోజుల క్రితం.. జేపీ నడ్డా చేసిన విమర్శలపై..ఘాటుగా స్పందించారు. గల్లీ లీడర్లా మాట్లాడారంటూ మండిపడ్డారు. ఆతర్వాతి రోజే బీజేపీ నేతలు.. ఆస్పత్రులు.. కోవిడ్ కంట్రోల్ సెంటర్ ముందు ధర్నాలు చేశారు.
దీంతో ఈటల రాజేందర్ మరోసారి కేంద్ర ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. తెలంగాణలో కరోనా కట్టడికే కేంద్రం నిధులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేవలం రూ. 214 కోట్లు మాత్రమే ఇచ్చిందని… అత్యధిక కరోనా టెస్టులు చేసేందుకు తీసుకు వచ్చిన అధునాతన కోబాస్ యంత్రాన్ని.. దారి మళ్లించి కోల్ కతాకు తీసుకెళ్లారని మండిపడ్డారు. ఈటలకు… టీఆర్ఎస్ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ వెంటనే కౌంటర్ ఇచ్చారు. తాము గల్లీ లీడర్లమేనని..గడీల లీడర్లం కాదన్నారు. కరోనా కట్టడిలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని టిమ్స్ ఆస్పత్రిని ఎందుకు అందుబాటులోకి తీసుకు రావడం లేదని ప్రశ్నించారు. తెలంగాణలో ఆయుష్మాన్ భారత్‌ను అమలు చేయాలని, కరోనా చికిత్సను ఆరోగ్యశ్రీలో చేర్చాలని డిమాండ్ చేశారు. కరోనాపై గెలిచేస్తామని మొదట్లో కేసీఆర్ ప్రకటించేవారు.
తబ్లిగీల కేసుల కారణంగా ఓ సారి.. ఆ తర్వాత వలసకూలీలు ఇలా కారణం చెబుతూ వచ్చారు. ఇప్పుడు…ఏ కారణం చెప్పడానికి లేకుండా.. కేసులు పెరిగిపోతున్నాయి. కరోనా కంట్రోల్ అయిపోతుందన్న ఉద్దేశంతోనే ఏమో.. ఒక్క గాంధీ ఆస్పత్రిలో తప్ప ఎక్కడా చికిత్సకు ఏర్పాట్లు చేయలేదు. దాంతో ఆ ఆస్పత్రిపై ఒత్తిడి పెరిగిపోయింది.సేవల్లో నాణ్యత తగ్గిపోయింది. ఇప్పుడు తెలంగాణ సర్కార్ ఇంటా బయటా రాజకీయ విమర్శలను ఎదుర్కొంటోంది. స్వంయగా కేంద్రంలో అధికారంలో ఉండి.. కరోనా కట్టడి విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సిన కేంద్రపార్టీ అయిన బీజేపీ కూడా..టీఆర్ఎస్ పై కాలుదువ్వుతోంది.