కాంగ్రెస్, టీడీపీల నుంచి నాయకుల్ని ఆకర్షించి భాజపా చేర్చుకుంటోంది. కానీ, భాజపా అసలు లక్ష్యం అధికార పార్టీ తెరాస. ఆ పార్టీ నుంచి ఒక్క నాయకుడినైనా ఆకర్షించి కాషాయ కండువా కప్పగలిగితే… రాజకీయంగా భాజపాది పైచేయి అయినట్టే. ఆ అవకాశం కోసం వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్న కమల దళానికి తెరాసలో అసంతృప్తుల ఎమ్మెల్యేలు మంచి అవకాశంగా ఇప్పుడు కనిపిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. మంత్రి పదవి వస్తుందని ఆశించి, భంగపడ్డ నేతలు బహిరంగానే అసంతృప్తి వ్యక్తం చేసిన తీరు చూశాం. బుజ్జగింపుల పర్వం తరువాత.. అబ్బే, అదేం లేదూ.. తూచ్, కేసీఆర్ నాయకత్వం జిందాబాద్ అనేశారు. అయితే, బోధన్ తెరాస ఎమ్మెల్యే షకీల్… భాజపా ఎంపీ అరవింద్ ని కలిశారు. కేసీఆర్ కి అత్యంత సన్నిహితుడు షకీల్. తెరాస పార్టీ పెట్టక ముందు నుంచి కూడా కేసీఆర్ కుటుంబంతో మంచి సంబంధాలున్న వ్యక్తి.
షకీల్ తో భేటీ సందర్భంగా తెరాసలో ఇతర అసంతృప్త నేతల గురించి అరవింద్ అడిగి తెలుసుకున్నారట. ఈ భేటీ గురించి షకీల్ ఏమీ చెప్పలేదుగానీ… సోమవారం నాడు మాట్లాడతా అన్నారు! దీంతో ఆయన పార్టీ మారే ఉద్దేశంలో ఉన్నారనే ప్రచారం ఒక్కసారిగా మొదలైంది. అంతేకాదు, మంత్రి పదవులు దక్కక, అసంతృప్తితోఉన్న ఇతర ఆరుగురు నాయకులతో కూడా భాజపా టచ్ లోకి వెళ్లే ప్రయత్నం చేస్తోందని తెలుస్తోంది. బాజిరెడ్డి గోవర్థన్, సీనియర్ నేత నాయిని నర్సింహా రెడ్డి, జోగు రామన్న… వీరంతా ఇంకా మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తితోనే రగులుతున్నారని సమాచారం. మంత్రి కేటీఆర్ ఫోన్లు చేసి బుజ్జగించినా, మీడియా ముందుకు వచ్చి తప్పదు కాబట్టి మమ అనేశారని తెలుస్తోంది!
సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు భాజపా ఏర్పాట్లు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆరోజున తెరాస నుంచి భాజపాలోకి చేరికలుంటాయని కమలం నాయకులు అంటున్నారు. అసంతృప్తి నేతలు అందరూ కాకపోయినా, షకీల్ వెళ్లినా కూడా తెరాసకు గట్టి దెబ్బే అవుతుంది. ఓరకంగా, రాష్ట్రంలో భాజపా బలమైన ప్రత్యామ్నాయంగా అవుతుందన్న నమ్మకం పెరుగుతుండేసరికి… తెరాసలో అసంతృప్తులు వ్యక్తమయ్యేందుకు కావాల్సిన ఒక రకమైన నైతిక బలం వచ్చినట్టుగా కనిపిస్తోంది. తాజా పరిస్థితిని సీఎం కేసీఆర్ ఎలా డీల్ చేస్తారో చూడాలి?