తమిళనాడులో పాగా వేయాలన్న ఉద్దేశంతో భాజపా తెర వెనక పావుల్ని కదుపుతున్న సంగతి తెలిసిందే. ఈ దిశగా అన్నాడీఎంకేలోని రెండు వర్గాలను కలిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు గత కొద్దిరోజులగా కథనాలు వినిపిస్తున్నాయి. పళని స్వామి, పన్నీర్ సెల్వమ్ వర్గాలను ఒకటి చేయడం ద్వారా రాజకీయ లబ్ధి ఉంటుందని భాజపా భావిస్తోందట! నిజానికి, గతంలో ఈ రెండు వర్గాల మధ్య చర్చలు ప్రారంభమైనా.. అవేవీ పూర్తిస్థాయిలో ఒక అభిప్రాయానికి రాకుండానే ముగిసిపోయాయి. అయితే, ఇప్పుడు భాజపా దర్శకత్వంలో జరుగుతున్న ప్రయత్నాలు త్వరలోనే ఫలితాలను సాధించబోతున్నాయనే అభిప్రాయం వ్యక్తమౌతోంది. ప్రస్తుతం ఓ మూడు లక్ష్యాలను నిర్దేశించుకుని భాజపా తమిళనాట పావుల్ని కదుపుతున్నట్టు విశ్లేషకులు చెబుతున్నారు.
మొదటిది.. ముందుగా అన్నాడీఎంకేలో రెండు వర్గాలను దగ్గర చేయడం. ఆ తరువాత, వాటిని భాజపాలో విలీనం దిశగా నడిపించడం! ప్రస్తుతం తమిళనాట సంచలనంగా వినిపిస్తున్న కథనం ఇదే. అయితే, ఇప్పటికిప్పుడే విలీనం అనేది తెరమీదకు రానివ్వరనీ, అంతకంటే ముందుగా తమిళనాడు రాజకీయ వాతావరణంలో చేయాల్సిన మార్పులు కొన్ని భాజపా ముందున్నాయట. ఇక, రెండో లక్ష్యం.. ఉమ్మడి శత్రువును దెబ్బతియ్యడం. ఇంతకీ ఆ ఉమ్మడి రాజకీయ శత్రువు ఎవరంటే శశికళ మేనల్లుడు టీటీవీ దినకరన్..! శశికళ వర్గాన్ని పూర్తిగా నిర్వీర్యం చేయాలంటే… ముందుగా ఆ వర్గానికి పార్టీలో స్థానం ఉండకూడదు. ఈ లక్ష్య సాధన దిశగా ఓ మాంచి వేటు ముహూర్తం కోసం అధికార పార్టీ ఎదురుచూస్తున్నట్టు సమాచారం. చిన్నమ్మ వర్గాన్ని పార్టీ నుంచి దూరం చేస్తే.. విలీన ప్రక్రియ మరింత సులువు అయిపోతుంది కదా. నిజానికి, ఇప్పటికే దినకరన్ చుట్టూ ఉచ్చు బిగుసుకుంటున్న సంగతి తెలిసిందే. ఎన్నికల కేసును ఆయన మెడకి తగిలించారు. దీంతోపాటు ఇతర మార్గాల నుంచి కూడా దినకరన్ పై ఒత్తిడి పెరిగే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇక, మూడో లక్ష్యం చాలా కీలకమైంది. చిన్నమ్మ వర్గాన్ని నిర్వీర్యం చేయడం, పళని – పన్నీర్ వర్గాలను విలీనం చేసినంత మాత్రాన భాజపాకి తమిళనాడులో ఆదరణ దొరుకుతుందా…? అంటే, అనుమానమే. ఎందుకంటే, తమిళ ప్రజలు కొన్ని దశాబ్దాలుగా స్థానిక పార్టీలనే నమ్ముతూ వస్తున్నారు. ఉత్తరాది పార్టీలు కూడా వాటిపై ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి, ఇప్పుడు మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో తమిళ తంబీలు భాజపాని ఎంతవరకూ ఆదరిస్తారనేది అసలు ప్రశ్న. అందుకే, భాజపా మూడో లక్ష్యంగా సూపర్ స్టార్ రజనీకాంత్ వైపు చూస్తున్నట్టుగా కూడా తెలుస్తోంది. రజనీ పార్టీ ఏర్పాటుపై ఇప్పటివరకూ ఊహాగానాలే వినిపించాయి. ఒకవేళ రజనీ రాజకీయ రంగ ప్రవేశం చేస్తే… తమవైపు తిప్పుకోవాలనే ఉద్దేశంతో భాజపా నేతలు ఇప్పట్నుంచే సిద్ధంగా ఉన్నారని కూడా చెబుతున్నారు. మొత్తంగా, ఒక దీర్ఘకాలిక వ్యూహంతో తమిళనాడు రాజకీయాల్లో చాపకింద నీరులా ప్రవేశించాలన్న ఉద్దేశంతో భాజపా ప్రయత్నిస్తోందన్న చర్చ ఆ రాష్ట్రంలో జోరుగా జరుగుతోంది. రాష్ట్రంలో కీలకమైన రెండు వర్గాలు పార్టీలో విలీనం అయితే, అది కచ్చితంగా సంచలనమే అవుతుందని చెప్పొచ్చు.