అనంతపురం జిల్లాకి కియా మోటార్స్ సంస్థ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యనే అక్కడి పనులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శంకుస్థాపన చేశారు. వచ్చే ఏడాదికి ఈ సంస్థ పూర్తిస్థాయిలో కార్ల ఉత్పత్తి మొదలుపెడుతుంది. దీన్లో భాగంగా ఆ సంస్థ తొలిదశగా దాదాపు 3000 మంది ఉద్యోగుల నియామకం మొదలుపెట్టింది. అయితే, ఇదంతా మా ఘనతే అని ప్రచారం మొదలుపెట్టేసింది భాజపా..! నిజానికి, తాజాగా విశాఖలో జరిగిన సీఐఐ సదస్సు నుంచే భాజపా ఈ ప్రచారం అందుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కృషి ఫలితంగానే కియా రాష్ట్రానికి వచ్చిందంటూ హరిబాబు అక్కడే అన్నారు. ఇప్పుడు ఇతర భాజపా నేతలు కూడా మేక్ ఇన్ ఇండియా సాధించిన అద్భుత విజయమిది, 3000 మందికి ఉద్యోగాలు వస్తున్నాయంటూ ప్రచారం చేస్తున్నారు. భాజపా నేత పురందేశ్వరితో సహా ఏపీ శ్రేణులు సోషల్ మీడియాలో మోడీ ఫొటో, పక్కనే కియా మోటార్స్ సంస్థ భవవం ఉన్న పోస్టర్ ను షేర్ చేస్తున్నారు.
మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కొన్ని ప్రముఖ సంస్థల్ని ఇండియాకు మోడీ సర్కారు ఆహ్వానించింది నిజమే. కానీ, కియా సంస్థ మాత్రం నేరుగా ఆంధ్రా కోసం రాలేదు. ఆంధ్రాలో మాత్రమే పెట్టాలని మోడీ సర్కారు వారికి సూచించిందీ లేదు. ఇది తమిళనాడు ప్రాజెక్ట్. అక్కడి ప్రభుత్వంతో ఒప్పందం కూడా కుదుర్చుకుని, త్వరలోనే పనులు ప్రారంభం కాబోతున్నాయనగా కియా కంపెనీ వెనక్కి తగ్గింది. ఎందుకంటే, కొన్ని అనుమతుల కోసం అక్కడి నాయకులు అడిగిన లంచాలు చూసి ఆ కంపెనీకి కళ్లుబైర్లుగమ్మాయి. ఇదే మాట ఆ కంపెనీ ప్రతినిధులే స్వయంగా వెల్లడించారు. తమిళనాడు తరువాత వారు గుజరాత్, లేదా ఆంధ్రాలో కంపెనీ ఏర్పాటుకు అనువైన పరిస్థితులు ఉన్నాయని కియా ముందే సర్వే చేసుకున్నారు. ఏపీ వారి చివరి ఆప్షన్.
కానీ, ఆంధ్రాలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండటం, గతంలో పారిశ్రామికాభివృద్ధికి ఆయన ఇచ్చిన ప్రాధాన్యత, హైదరాబాద్ ఐటీ అభివృద్ధి ట్రాక్ రికార్డ్, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో ఏపీ ముందుంజలో ఉండటం… ఇవన్నీ చూసుకున్నాక కియా అనంతపురానికి వచ్చింది. అంతేకాదు, ఆ సంస్థ వేరే రాష్ట్రానికి తరలిపోకుండా, ఆంధ్రాకి తెప్పించడం కోసం చంద్రబాబు చేసిన మంతనాలు చాలానే ఉన్నాయి. ఈ మొత్తం ప్రాసెస్ లో భాజపా నేతల పాత్రగానీ, మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ భాజపా నాయకుల ప్రమేయంగానీ ఏమాత్రం లేదు. కానీ, ఇదంతా మా ఘనతే అని రాష్ట్ర నేతలు ప్రచారం చేసుకోవడం చూస్తుంటే విడ్డూరంగా ఉంది!