మెగాస్టార్ చిరంజీవి ని బీజేపీ లోకి లాగడానికి ఆ పార్టీ ప్రయత్నాలను ముమ్మరం చేసింది. 2024 లోపు ఆంధ్రప్రదేశ్లో కూడా అధికారంలోకి రావడానికి వ్యూహాలు రచిస్తున్న బీజేపీ, అందుకు ఏ ఒక్క అవకాశాన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు అన్న సంకేతాలు ఇస్తోంది. వివరాల్లోకి వెళితే..
2008లో ప్రజారాజ్యం పార్టీని స్థాపించి ఆ తర్వాత ఆ పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి, కేంద్ర సహాయ మంత్రి పదవితో సరిపెట్టుకున్న చిరంజీవి రాజకీయాల్లో తాను ఆశించిన లక్ష్యాన్ని చేరుకోలేక పోయారు అని చెప్పాలి. ముఖ్యమంత్రి అవ్వాలనే ఆశతో రాజకీయాల్లోకి వచ్చిన చిరంజీవి కి, తన పార్టీని విలీనం చేసుకున్న కాంగ్రెస్ కనీసం కేబినెట్ స్థాయి కేంద్ర మంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం చిరంజీవి అభిమానుల లో కూడా అసంతృప్తిని మిగిల్చింది. 2018 ఏప్రిల్ లో చిరంజీవి రాజ్యసభ సభ్యత్వం కూడా ముగియడంతో అప్పటినుండి రాజకీయ కార్యకలాపాలకు చిరంజీవి దూరంగా ఉన్నారు. తన సినిమా షూటింగులతో బిజీ అయిపోయి ఏ రాజకీయ పార్టీలో తాను లేను అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. 2019 ఎన్నికల్లో ప్రచారం చేయలేదు.
అయితే చేరికల విషయంలో వేగం పెంచిన బీజేపీ తెలుగుదేశం పార్టీ నేతలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగిస్తోంది. 23 మంది టీడీపీ ఎమ్మెల్యేల లో ఎంతమంది తెలుగుదేశం పార్టీలో ఉంటారో అర్థం కాని పరిస్థితి ఉంది. ఇక ఓడిపోయిన ఎమ్మెల్యేలలో చాలామంది ఇప్పటికే బీజేపీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నారు. చిరంజీవి కనుక తమ పార్టీలో చేరితే పార్టీ రాష్ట్ర నాయకత్వ బాధ్యతలు అప్పగించడమే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్థిగా కూడా ప్రకటిస్తారని రాజకీయవర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
అయితే చిరంజీవి బీజేపీ ఆఫర్ ని ఎంత వరకు ఒప్పుకుంటారు అనేది ప్రస్తుతానికి సందేహాస్పదంగా కనిపిస్తుంది . ఏది ఏమైనా ఈ విషయంలో తదుపరి అప్డేట్స్ కోసం వేచి చూడాల్సి ఉంది