ఆంధ్రప్రదేశ్ కి 13 వ ఆర్ధిక సంఘం 97 వేల కోట్ల రూపాయలు కేటాయించింది. ఆదాయాలు, అందులో రాష్ట్రాలకు ఇవ్వవలసిన వాటాల పద్ధతిని రీస్ట్రక్చర్ చేశాక 14 వ ఆర్ధిక సంఘం 2 లక్షల 10 వేల కోట్ల రూపాయల వరకూ కేటాయించబోతోంది.
ప్రత్యేక హోదా, ఆర్ధిక సహాయాలపై బిజెపి, తెలుగుదేశం పార్టీల మధ్య వివాదాలు ముదిరి పరస్పరం బహిరంగ విమర్శలు చేసుకునే పరిస్ధితి వచ్చినా నెలల తరబడి మౌనం పాటించిన బిజెపి ఈ విషయాన్ని వెల్లడించిన తీరు ఆశ్చర్యకరంగా, అనుమానాస్పదంగా వుంది.
బిజెపి – జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎపి ఇన్ చార్జ్ సిద్ధార్ధనాధ్ సింగ్ నాలుగురోజుల క్రితం విశాఖపట్టణంలో ఈ విషయం వెల్లడించారు. పార్టీల స్ధాయిలోఘర్షణాత్మక ధోరణికి, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంబంధాలను ఇరకాటంలో నెట్టే దిశకూ పరిస్ధితులు విషమిస్తున్న సమయంలో ఆర్ధిక సహాయాలపై పార్టీ తన ఇన్ చార్జితో ఈమాట చెప్పించడంలో ఆక్షేపణ ఏదీ లేదు. కానీ, బ్రేకింగ్ న్యూస్ లో, ఫస్ట్ పేజీలో రావలసిన విషయం పెద్ద ప్రాధాన్యత లేనంతగా వెల్లడింపజేయడం కొంత అనుమానాస్పదంగానే వుంది.
బిజెపి అధ్యక్షుడు అమిత్ షా రాజమహేంద్రవరం సభలో కేంద్రం 1 లక్షా 65 వేల కోట్ల రూపాయల సాయం అందించింది అన్నారు. ఆరురోజుల క్రితం విజయవాడలో బిజెపి కోర్ కమిటీ సమావేశం తరువాత సిద్ధార్ధనాధ్ సింగ్ మీడియాతో మాట్లాడుతూ కేంద్రం ఎపికి ఇంతవరకూ 1 లక్షా 40 వేల కోట్ల రూపాయల సాయం చేసిందన్నారు. ఆతరువాత రెండు రోజులకు బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యుడు, ఎపిలో ఎమ్మెల్సీ సోము వీర్రాజు విశాఖలో పార్టీ సమావేశంలో మాట్లాడుతూ కేంద్రం అమరావతి నిర్మాణానికే 20 వేల కోట్ల రూపాయలు ఇచ్చిందన్నారు.
అన్యాయంగా, ఏకపక్షంగా జరిగిన విభజన వల్ల అన్ని విధాలా నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ నిలదొక్కుకోడానికి ప్రత్యేక హోదా ఇస్తమని హామీ ఇచ్చారు. పోలవరం ప్రాజెక్టుకి నూరుశాతం కేంద్రనిధులు, వెనుకబడిన ప్రాంతాలకు అభివృద్ధి నిధులు, రాష్ట్రానికి రైల్వేజోను..మొదలైన అంశాలను విభజన చట్టంలో పేర్కొన్నారు.
హోదా లేదు, ఆర్ధిక సహాయమూ లేదు…ఇవి ఎప్పుడు ఎలా అమలు చేస్తోరో చెప్పేవారులేరు. ఇప్పటికే లక్షాఅరవైఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చేశామంటారు. ఏలెక్కన …ఎలా అంటే ? ఇంకా ఇస్తామంటారు…ఎపిని ఘనంగా వృద్ధి చేస్తామంటారు!
హామీ, చట్టం, హక్కుల ప్రస్తావనే లేకుండా ప్యాకేజీల గురించే బిజెపి నాయకులూ, కేంద్ర మంత్రులూ మాట్లాడుతారు. ఇదంతా కేంద్రం అదనంగా చేయబోతున్న సాయంగా ఆంధ్రప్రదేశ్ భ్రమించాలన్నది బిజెపి పెద్దల ఆలోచనలా అర్ధమౌతోంది. 14 వ ఆర్ధిక సంఘం సిఫార్సుల ప్రకారం ప్రత్యేక హోదా సాధ్యం కాదని చెబుతున్న బిజెపి నాయకులు అదే సంఘం కేటాయింపుల ప్రకారం ఆదాయాల నుంచి పన్నుల నుంచి ఆంధ్రప్రదేశ్ కు రావలసిన ఆదాయాలు, పన్నుల్లో వాటాలు 97 వేల కోట్ల రూపాయల నుంచి 2 లక్షల 10 వేల కోట్ల రూపాయలకు పెరుగుతుందన్న విషయాన్ని ఇంత వరకూ ఎందుకు వెల్లడించలేదు? ఇపుడైనా ప్రభుత్వ స్ధాయిలో కాక పార్టీ స్ధాయిలోనే ఎందుకు చెప్పించారు? అని ఆలోచిస్తే ఫైనాన్స్ కమీషన్ కేటాయింపులను కూడా కేంద్రప్రభుత్వ దయాధర్మాలుగానే చూపించే హీనమైన ఆలోచన వున్నట్టు అర్ధమౌతోంది.
14 ఆర్ధిక సంఘం కేటాయింపుల ప్రకారమే నిధుల కేటాయింపులు చేయడమంటే అది జనాభా దామాషాలో అన్నిరాష్ట్రాలకూ అందే వాటా మాత్రమే! విభజనలో నష్టపోయిన రాష్ట్రం నిలదొక్కుకోడానికి అదనంగా ఇచ్చేది ఏదీలేదనే!! మామూలుగా వచ్చేవాటానే అదనపు సహాయంగా చూపించే ఆలోచన వల్లే కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి ఇన్ని పిల్లిమొగ్గలు వేస్తోందా? ఈ అనుమానం రావడం తప్పుకాదు. దేశపాలకులకు పారదర్శకత్వం లేకపోవడమే ఈ అనుమానాకికి కారణం!