స్టీల్ ప్లాంట్ రాజకీయంలో బీఆర్ఎస్ సహా అన్ని పార్టీలు బీజేపీ ట్రాప్లో పడి అబ్బా అన్నాయి. అధికారం లేని ఓ సహాయ మంత్రి చేసిన ప్రకటనను అడ్డం పెట్టుకుని కాలర్లు ఎగరేసి.. తామే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేశామని గప్పాలు కొట్టుకున్నారు. ఇప్పుడు ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితికి తెచ్చుకున్నారు. ఈ పరిస్థితి బీఆర్ఎస్కే కాదు అన్ని పార్టీలకూ వచ్చింది.
ఏపీలో అడుగు పెట్టడానికి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ పోరాటం గొప్ప చాన్స్ అనుకున్న బీఆర్ఎస్ చేసిన రాజకీయం ఆ పార్టీని నవ్వుల పాలు చేసింది. బిడ్ వేస్తామని హడావుడి చేసింది. ఇప్పుడు బిడ్ కూడా వేయడం లేదు. కానీ అలా బిడ్ వేస్తామనగానే… స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిపోయిందని ప్రచారం చేసుకున్నారు. కేసీఆర్ దెబ్బ అంటే అలా ఉంటుందంటూ కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలంతా ఎలివేషన్లు ఇచ్చుకున్నారు. విశాఖలో విజయోత్సవాలు చేస్తామన్నారు. కానీ ఇప్పుడు వారే తమ ఓవరాక్షన్ పై నవ్వుకోవాల్సిన పరిస్థితి.
ఒక్క బీఆర్ఎస్ మాత్రమే కాదు.. అన్ని పార్టీలు నవ్వుల పాలయ్యాయి. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకపోయినా.. ప్రస్తుతానికి ఆపేశారని అనుకున్న రాజకీయ పార్టీలు తమ పోరాటాల వల్లేనని చెప్పుకోవడం ప్రారంభించాయి. తెలుగుదేశం పార్టీ నేతలు తమ నేత పల్లా శ్రీనివాసరావు ఆమరణదీక్ష చేశారని గుర్తు చేశారు. జీవీఎల్ నరసింహారావు ఉన్న పళంగా ఢిల్లీ నుంచి విశాఖ వచ్చి స్టీల్ ప్లాంట్ ఉన్నతాధికారులతో సమావేశం అయ్యారు. ఆ క్రెడిట్ తమకే దక్కాలన్నట్లుగా వ్యవహరించారు. ఇక వైఎస్ఆర్సీపీ నేతలు.. ఇటీవల సీఎం జగన్ డిల్లీ పర్యటనలో ప్రధాని మోదీతో ఈ విషయంపై మాట్లాడారని అందుకే వెనక్కి తగ్గారని ప్రచారం చేసుకున్నారు. చివరికి పవన్ కల్యాణ్ కూడా స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ ఆగిపోయిందన్నట్లుగా ట్వీట్ చేశారు. జనసేన పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు పవన్ పోరాటం ఫలించిందని చెప్పుకున్నారు. ఇలా అందరూ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేయకుండా గట్టిగా ప్రయత్నించామని ఎవరికి వారు ప్రచారం చేసుకున్నారు.
కానీ ఇప్పుడు అందరూ చిన్నబోయేలా కేంద్రం చక్రం తిప్పేసింది ప్రజల ముందు వారిని నవ్వుల పాలు చేసేందుకు ప్రయత్నించింది. ఆ ట్రాప్లో రాజకీయ పార్టీలు పడ్డాయి. ఇక్కడ బీజేపీకి పడే ఫరక్ ఏమీ ఉండదు. ఎందుకంటే ఏపీలో బీజేపీ చేయగలిగింది.. చేసేది ఏమీ లేదు మరి !