లోక్ సభ, అసెంబ్లీలకు కలిపి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని భాజపా చాన్నాళ్లుగా ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని ఉన్నతాధికారులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కోరారు కదా! అయితే, ఈ మధ్యనే జమిలిపై వివిధ రాజకీయ పార్టీలతో లా కమిషన్ భేటీ అయింది. చాలా పార్టీలు జమిలికి సుముఖంగా లేవనే అభిప్రాయమే వ్యక్తమైంది. ఈ నెల 31లోగా లా కమిషన్ గడువు ముగుస్తుంది. అంటే, ఈలోగా కేంద్రానికి ఒక నివేదిక ఇస్తుంది. జమిలి ఎన్నికలో నిర్వహించాలంటే ప్రజాప్రాతినిధ్య చట్టంలో సవరణ చేయాల్సి ఉందనేది నిపుణుల అభిప్రాయం. దీంతోపాటు, కేంద్ర ఎన్నికల సంఘం కూడా జమిలి నిర్వహణలో ఉన్న ఇబ్బందుల్ని ఇటీవలే తేల్చిచెప్పింది.
రాజకీయంగా చూసుకుంటే భాజపాకి జమిలి అవసరం ఉందనే అభిప్రాయమే వ్యక్తమౌతోంది. 11 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్ని లోక్ సభతో కలిపి నిర్వహించాలని వారు చేయాల్సిన ప్రయత్నాలు వారు చేస్తున్నారు. అయితే, ఆ కథనాల్లో వాస్తవం లేదంటూ తాజాగా భాజపా తోసిపుచ్చడం విశేషం..! అంతేకాదు, 11 రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పార్టీలతో ఏకాభిప్రాయం సాధించేందుకు భాజపా ప్రయత్నిస్తోందన్న కథనాల్లో వాస్తవం లేదంటూ ఆ పార్టీ అధికార ప్రతినిధి సంభిత్ పాత్రా ఖండించారు! లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికల్ని ఒకేసారి నిర్వహిస్తే మంచిదనేది మాత్రమే తమ ప్రతిపాదన అనీ, దీని కోసమనీ కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్ని ముందుకు జరపడమూ, మరికొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం లాంటి ఆలోచనలు ఏవీ భాజపా చేయడం లేదని ఆయన తేల్చి చెప్పారు.
నిజానికి, జమిలికి వెళ్లకపోతే భాజపా పాలిత రాష్ట్రాల్లో ఎదురుదెబ్బ తప్పదనే అంశమే ప్రస్తుతం భాజపాలో చర్చనీయంగా ఉందనే కథనాలు వినిపిస్తున్నాయి! మధ్యప్రదేశ్, ఛత్తీస్గడ్, రాజస్థాన్ లలో భాజపాకి ఎదురుగాలి వీస్తోందంటూ కొన్ని సర్వేలు చెబుతున్నాయి. లోక్ సభ సార్వత్రిక ఎన్నికలకు ముందు మూడు రాష్ట్రాల్లో ఓటమి ఎదురైతే… అది భాజపాకి చాలా ఇబ్బందికరమైన పరిస్థితే అవుతుంది. అందుకే, 11 రాష్ట్రాలూ కాకపోయినా.. కనీసం ఆ మూడు రాష్ట్రాలనైనా లోక్ సభ ఎన్నికలతో కలిపి జరపాలన్నది ప్రధాని మోడీ అభిప్రాయంగా భాజపా వర్గాల్లో చర్చ జరుగుతోంది. కానీ, వాస్తవ పరిస్థితులు వేరుగా కనిపిస్తున్నాయి. సాంకేతికంగా సమస్యలు చాలా ఉన్నట్టు అనిపిస్తున్నాయి. అందుకేనేమో… జమిలిపై తాము చేస్తున్న ప్రయత్నాలన్నీ కేవలం ప్రతిపాదనలు మాత్రమే అనే అభిప్రాయాన్ని ఇప్పట్నుంచీ చిన్నగా వినిపించడం మొదలుపెట్టించారు ప్రధాని మోడీ..!