తెలంగాణ బీజేపీ నేతలు కేసీఆర్.. చేస్తున్న విధానపరమన నిర్ణయాలు, ఆరోపణలను గట్టిగా తిప్పి కొట్టడానికి తంటాలు పడుతున్నారు. కేంద్రం కొత్త విద్యుత్ చట్టాలను తీసుకొస్తోంది. పొరుగున ఉన్న ఏపీ సంస్కరణలు అమలు చేస్తోంది. ఉచిత విద్యుత్ ఎత్తివేసి.. ఆ మేరకు అకౌంట్లలో వేస్తామని చెబుతోంది. అయితే తెలంగాణ ఇంకా సంస్కరణలకు అంగీకరించలేదు. కేంద్రం చెప్పినట్టుగా.. ప్రతి మోటర్‌కు విద్యుత్తు మీటర్‌ను బిగించి.. ఆ బిల్లును నెలనెలా రైతుల నుంచి వసూలుచేసి.. ఆ పైనే సబ్సిడీ రూపంలో వారి ఖాతాల్లో డబ్బులు వేయడం సాధ్యం కాదని.. రైతుపై అది పెను భారమవుతుందని భావిస్తోంది. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ముందుకు వెళితే.. క్రాస్ సబ్సిడీ లేకుండాచేస్తే.. ప్రతి రైతు నెలకు వేలల్లో విద్యుత్తు బిల్లు కట్టాల్సి ఉంటుంది.
అది తెలంగాణ రైతాంగానికి తీవ్ర శరాఘాతం అవుతుంది. ఇదే విషయాన్ని కేసీఆర్ బహిరంగసభల్లో అసెంబ్లీల్లో చెబుతున్నారు. బాయి దగ్గర మీటర్ రావొద్దంటే .. బీజేపీకి ఓటు వేయవద్దని ఆయన పిలుపునిస్తున్నారు. మునుగోడు సభలో కేసీఆర్ … తను చెప్పిన విద్యుత్ అంశాలపై ప్రతీ ఇంట్లో చర్చ జరగాలన్నారు. అసెంబ్లీలోనూ అదే చెప్పారు. తెలంగాణలో 25 లక్షలకు పైగా బోరుబావులు.. కాళేశ్వరం సహా అనేక ఎత్తిపోతల పథకాలకు విద్యుత్తే ప్రధాన వనరు. ఇప్పుడు కరెంట్ విషయంలో కేంద్రం ఇబ్బంది పెడుతుందని భావిస్తే.. తెలంగాణ రైతులు బీజేపీకి మద్దతిచ్చే చాన్సే ఉండదు.
కేసీఆర్ చేసే ప్రచారంతో ఎంత ఇబ్బంది ఉంటుందో బీజేపీ నేతలకు బాగా తెలుసు. అందుకే విద్యుత్ చట్టం ఇంకాపాస్ కాలేదని సెలక్ట్ కమిటీకి వెళ్లిందని ప్రచారం చేస్తున్నారు. అదే సమయంలో కేసీఆర్ విద్యుత్ చట్టం రైతులకు వ్యతిరేకం అంటున్నారని.. అలాంటివేమీ లేవని.. కేసీఆర్ చెబుతున్నట్లుగా విద్యుత్ చట్టంలో అవేమీ లేవని ఉన్నట్లుగా నిరూపిస్తే రాజీనామాలు చేస్తామని సవాళ్లు చేస్తున్నారు. కానీ వారి వాదన ప్రజల్లోకి వెళ్లడం లేదు. ఈ విషయంలో కేసీఆర్ అడ్వాంటేజ్ సాధించినట్లుగా కనిపిస్తోంది.