విజయసాయిరెడ్డి తెలుగుదేశం పార్టీపై ఇష్టం వచ్చినట్లుగా విమర్శలు చేయవచ్చు కానీ.. బీజేపీ జోలికి మాత్రం ఇప్పటి వరకూ వెళ్లలేదు. వెళ్లినా… టీడీపీ ముద్ర వేసి బీజేపీ నేతల్ని విమర్శించేవారు . కానీ ఇప్పుడు నేరుగా బీజేపీనే టార్గెట్ చేసేందుకు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారన్న అభిప్రాయం రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది. వ్యూహాత్మకంగానే విజయసాయి రెడ్డి కవ్వింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. చంద్రబాబుకు… మోడీ ఫోన్ చేసిన తర్వాత రాజకీయంలో మార్పు వచ్చిందని..వైసీపీ భావిస్తున్నట్లుగా కనిపిస్తోందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి.
విజయసాయిరెడ్డి వెనక్కి తగ్గడం లేదు. అంతకంతకూ ఆరోపణల స్థాయి పెంచుకుటూ పోతున్నారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే నేతల్ని.. అందులో చేరుస్తూ పోతున్నారు. మొదట సుజనా చౌదరి.. ఆ తర్వాత సుజనాతో పాటు కన్నా లక్ష్మినారాయణ .. ఇప్పుడు వారితో పాటు పురందేశ్వరిని కూడా కలిపారు. గత ఎన్నికల్లో బీజేపీ హైకమాండ్ పెద్ద ఎత్తున ఏపీకి నిధులు పంపిందని.. వాటిని కన్నా లక్ష్మినారాయణ, పురందేశ్వరి ఎంతెంత తీసుకున్నారో కూడా తెలుసని విజయసాయిరెడ్డి బెదిరింపు ధోరణిలో కొత్త ఆరోపణలు చేశారు. అమరావతి విషయంలో మొదట సుజనా చౌదరి ప్రభుత్వంపై విమర్శలు చేసినప్పుడు… బీజేపీలో చేరిన చంద్రబాబు ఏజెంటని ఆరోపించారు. ఇప్పుడు కన్నా లక్ష్మినారాయణ టీడీపీకి అమ్ముడుపోయారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వంపై పురందేశ్వరి కూడా విమర్శలు చేస్తున్నారు. ఇప్పుడు ఆమెపై పార్టీ ఫండ్ తీసుకున్నారనే ఆరోపణలను విజయసాయిరెడ్డి చేస్తున్నారు. అంటే.. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించే వారందర్నీ.. ఇలాంటి ఆరోపణలతో… డిఫెన్స్‌లో పడేసి… నోరెత్తకుండా చేయాలనే వ్యూహం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అదే సమయంలో.. బీజేపీ హైకమాండ్ తో తమకు సన్నిహిత సంబంధాలున్నాయన్న ఓ అభిప్రాయాన్ని విజయసాయిరెడ్డి ఇక్కడి బీజేపీ నేతల్లోకి పంపే ప్రయత్నం చేస్తున్నారు. కేంద్ర బీజేపీ అభిప్రాయాలను అర్థం చేసుకోకుడా.. ఇక్కడ నేతలు ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారని అంటున్నారు. అంతే కాదు.. కన్నా లాంటి వాళ్లు ఉంటే బీజేపీ ఎదగదని కూడా చెప్పుకొస్తున్నారు. అధికార పార్టీని విమర్శించకుండా.. పొగుడుతూ ఉండి. టీడీపీని మాత్రమే టార్గెట్ చేస్తే.. బీజేపీ ఎదుగుతుందని.. విజయసాయిరెడ్డి ఎందుకు సలహాలివ్వాలనుకుంటున్నారో బీజేపీ నేతలకు సులువుగానే అర్థం అవుతోంది. భవిష్యత్ రాజకీయాలను విజయసాయిరెడ్డి ముందుగానే ఊహించి… బీజేపీని టార్గెట్ చేయడం ప్రారంభించారని అంటున్నారు. ఇప్పుడు ఏపీ బీజేపీ నేతల్ని తర్వాత జాతీయ నేతల్ని కూడా గురి పెడతారని అంటున్నారు.