తెలంగాణ భాజపాకి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేసే ప్రక్రియ మొదలైనట్టు సమాచారం. నిజానికి, కొత్త అధ్యక్ష నియామకానికి సంబంధించి గడచిన నెలలోనే రాష్ట్రస్థాయిలో చర్చ ప్రారంభమైంది. ప్రస్తుత అధ్యక్షుడు లక్ష్మణ్ ని కొనసాగిస్తారనీ, ఆ దిశగా ఆయనా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని కథనాలు వినిపించాయి. బీసీలకు ప్రాధాన్యత ఇచ్చే క్రమంలో ఆయనకే మరోసారి ఛాన్స్ ఉంటుందన్న అంచనాలూ తెరమీదికి వచ్చాయి. అయితే, తాజాగా డిసెంబర్ నెలాఖరు నాటికి కొత్త అధ్యక్షుడిని ఎంపిక చేయాలనే నిర్ణయంతో జాతీయ నాయకత్వం ఉందని తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర భాజపా వ్యవహారాల ఇన్ ఛార్జ్ ఇటీవల రాష్ట్రంలో పర్యటించి వెళ్లారు. తెలంగాణలో నాయకత్వ మార్పుపై ఆయన కొన్ని సూచనలు చేసినట్టుగా భాజపా వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీ అధినాయకత్వానికి రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ కృష్ణదాస్ ఇచ్చిన నివేదికలో… లక్ష్మణ్ ని మార్చాలనే దిశగానే సూచనలున్నట్టుగా తెలుస్తోంది. ఇక్కడి నాయకుల అభిప్రాయాలను తీసుకున్నాకనే ఈ తరహా నివేదిక ఆయన తయారు చేసినట్టుగా సమాచారం. ఇక్కడి నాయకులు ఎవరంటే… రాజాసింగ్, ఇంద్రసేనా రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, జితేందర్ రెడ్డి, డీకే అరుణ వంటి నేతలతో దాస్ చర్చించారని సమాచారం. లక్ష్మణ్ నాయకత్వంలో భాజపాకి కొత్తగా తెలంగాణలో వచ్చిన ఊపంటూ ఏదీ లేదనే అభిప్రాయం ఈ సమాలోచనల్లో వ్యక్తమైనట్టు తెలుస్తోంది. హుజూర్ నగర్ ఉప ఎన్నికలో సత్తా చాటుకుంటుందీ అనుకుంటే, కేవలం 2500 ఓట్లకు మాత్రమే పరిమితం కావాల్సి వచ్చింది. సభ్యత్వ నమోదు అంటూ హడావుడి చేసిన, అదీ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేదన్న అభిప్రాయమూ పార్టీలో ఉంది. వరుసగా జరిగిన ఎన్నికల్లో ఎంతో కొంత ప్రభావితం చేసే స్థాయిలో పార్టీని నడిపించడంలో రాష్ట్ర నాయకత్వం వరుసగా విఫలమౌతోందనేది అధిష్టానం అభిప్రాయంగా తెలుస్తోంది.
అయితే, త్వరలోనే లక్ష్మణ్ ని ఢిల్లీకి పిలిచే అవకాశం ఉందని సమాచారం. తమకు అందిన నివేదికను ఆధారంగా చేసుకుని లక్ష్మణ్ తో జాతీయ నాయకులు మాట్లాడతారని అంటున్నారు. ఆ భేటీ జరిగితే పరిస్థితి ఎలా మారుతుందో చూడాలి. ఏదేమైనా, డిసెంబర్ నాటికి రాష్ట్ర భాజపా అధ్యక్షుడిని నియమించాలనీ, కొత్త ఏడాది ప్రారంభం నుంచి పార్టీ కార్యక్రమాలు మరింత తీవ్రతరం చేయాలన్నది జాతీయ నాయకత్వం వ్యూహంగా కనిపిస్తోంది.