ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా పథకంలో భాగంగా రైతుల అకౌంట్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ చేశారు. అలా చేస్తున్నట్లుగా పత్రికలకు ప్రకటనలు ఇచ్చారు. అయితే అందులో ఎక్కడా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫోటో లేదు. మామూలుగా అయితే ఎవరూ పట్టించుకునేవారు కాదు కానీ… అసలు పథకం పేరే “వైఎస్ఆర్ రైతు భరోసా – పీఎం కిసాన్ యోజన..” . పేరుతో కూడా పీఎం ఉంది. అయనా మోడీ ఫోటో పెట్టలేదు. వైఎస్ఆర్ ఫోటో..జగన్ ఫోటోలను మాత్రం పెట్టారు. గత ఏడాది మోడీ ఫోటో కూడా పెట్టారు. దీంతో బీజేపీ నేతల అహం దెబ్బతిన్నది. రైతు భరోసా పథకంలో భాగంగా మూడు విడతల్లోరైతులకు ఇస్తున్న రూ.13500లో..రూ.ఏడు వేల ఐదు వందలు మాత్రమే ఏపీ సర్కార్ ఇస్తోంది.
మిగతా ఆరు వేల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తోంది. ఈ రైతు భరోసా పథకం కింద ఏపీ ప్రభుత్వం 6 వేల 500 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నామని ప్రకటించినప్పటికీ ఇందులో దాదాపుగా 40 శాతం నగదు కేంద్రం నుంచి వచ్చేవే. పీఎం కిసాన్ పథకం కింద ఈ సొమ్మును కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. ఏపీ ప్రభుత్వం ఇచ్చేది కేవలం 7 వేల 500 రూపాయలుండగా .. కేంద్రం ఇచ్చేవి 6 వేలు రూపాయలుగా ఉంది. ఈ పథకం సొమ్మంతా తామే ఇస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రచారం చేసుకోవడాన్ని బీజేపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కనీసం ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఫొటో ముద్రించకుండా కేంద్రం ఇచ్చే డబ్బును తమ పథకంగా జగన్ ప్రచారం చేసుకోవడం ఏమిటని బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయాన్ని ఇంతటితో వదిలి పెట్టకూడదని.. బీజేపీ నేతలు భావిస్తున్నారు. ఏపీ ప్రభుత్వ తీరుపై ఇప్పటికే.. బీజేపీ వర్గాల్లోచర్చ నడుస్తోంది. రేపోమాపో దీనిపై ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాలని భావిస్తున్నారు. ప్రధానమంత్రికి జరిగిన అవమానాన్ని హైకమాండ్ దృష్టికి తీసుకెళ్లిన నేతలు వారి స్పందన కోసం ఎదురు చూస్తున్నారు.