విశాఖపట్నం భూముల కుంభకోణానికి సంబంధించి అధికార పార్టీ వర్గాల్లో భేదాభిప్రాయాలు ఉన్న సంగతి తెలిసిందే. ఏపీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, చింతకాయల అయ్యన్న ప్రాతుడు మధ్య ఇదే అంశం రాజకీయ చిచ్చుకు కారణమైన వైనాన్ని చూశాం. ముఖ్యమంత్రికి గంటా లేఖ రాయడం, సీఎం క్లాస్ తీసుకోవడం, ఆ తరువాత, అయ్యన్న పాత్రుడి వాయిస్ మారిపోవడం కూడా జరిగిపోయింది. విశాఖ భూదందాపై సమగ్ర విచారణకు ముఖ్యమంత్రి ఆదేశించారనీ, ప్రత్యేక దర్యాప్తు బృందం అదే పనిలో ఉందని అధికార పార్టీ వర్గాలు ప్రస్తుతం చెబుతున్నాయి. అయితే, ఈ అంశంపై ఆంధ్రా భాజపా నేతల స్పందన మరోలా ఉంటోంది. దీన్ని కాస్త సీరియస్ గానే తీసుకుంటున్నారు. భూస్కామ్ విషయంలో భాజపా శాసన సభా పక్ష నేత విష్ణుకుమార్ రాజు ఇప్పటికే చాలా విమర్శలు చేశారు. తాజాగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు కూడా స్పందించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ఓ లేఖ రాశారు. ఈ లేఖలో పరోక్షంగా మంత్రి గంటా శ్రీనివాసరావును టార్గెట్ చేసుకోవడం గమనార్హం!
విశాఖ భూదందా విషయంలో ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో సోము వీర్రాజు కోరారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే, ఆ పార్టీ పంచన చేరేవారికి అవకాశాలు ఇవ్వకూడదనీ, అలాంటి వారికి రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కకూడదని వీర్రాజు వ్యాఖ్యానించడం విషయం. మంత్రి గంటా శ్రీనివాసరావు గడచిన ఎన్నికల ముందే తెలుగుదేశం పార్టీలోకి వచ్చి చేరిన సంగతి తెలిసిందే. అంతకుముందూ మంత్రిగా ఉన్నారూ, ఇప్పుడూ టీడీపీ సర్కారులో మంత్రిగా కీలక పాత్ర పోషిస్తున్నారు. సోము వీర్రాజు వ్యాఖ్య ఆయన్ని దృష్టిలో పెట్టుకుని చేసినట్టుగా ఉందనే అనిపిస్తోంది. భూదోపిడీకి పాల్పడ్డవారు ఎంత పెద్దవారైనా ప్రభుత్వ చర్యలు కఠినంగా ఉండాలని ఆయన డిమాండ్ చేశారు.
ఈ వ్యవహారానికి సంబంధించి పరోక్షంగా గంటాను ఏపీ భాజపా టార్గెట్ చేస్తుండటం విశేషం. రాబోయే రోజుల్లో ఇదే అంశాన్ని ప్రధానాస్త్రంగా చేసుకుని చంద్రబాబు సర్కారుపై విమర్శలు చేసేందుకు భాజపా సిద్ధమౌతోందని తెలుస్తోంది. విశాఖ భూదందా నేపథ్యంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను భాజపా అధిష్టానానికి కూడా ఏపీ నేతలు చేరవేశారనీ అంటున్నారు. ఇప్పటికే భాజపా – టీడీపీల మధ్య సంబంధాలు తుమ్మితే ఊడిపోయే ముక్కు అన్నట్టుగా ఉన్నాయి. వచ్చే ఎన్నికల్లో పొత్తు విషయంలో ఏపీ భాజపా నేతలు వాదన కూడా భిన్నంగా వినిపిస్తోంది కదా. మరి, ఈ ఇష్యూని ఏపీ భాజపా కాస్త సీరియస్ గా తీసుకుంటే రాబోయే రోజుల్లో రాజకీయం మరింత వేడెక్కే అవకాశం ఉంటుంది.