భాజపాకి ఆగ్రహం కలిగిస్తే… లాలూ లాంటివారిపై ఉన్న కేసుల విచారణ జెట్ స్పీడ్ లో జరిగిపోతుంది. జైలుకెళ్లిపోతారు. భాజపాకి అనుగ్రహం కలిగితే… గాలి జనార్థన్ రెడ్డి లాంటి వారిపై అత్యంత బలంగా నమోదై ఉన్న కేసులను కూడా గాలికి వదిలేసే మార్గాలూ మతలబులు తెరమీదికి వస్తాయి! గాలి విషయంలో ఇప్పుడు జరగబోతున్నది ఇదే అనేది మరోసారి బలపడింది. ప్రముఖ జర్నలిస్ట్ భర్కాదత్ తాజాగా ఒక ట్వీట్ చేశారు. గాలి జనార్థన్ రెడ్డిపై ఉన్న కేసుల గాలి తీసేలా, అందుకు అనువైన సాంకేతిక కారణాలను ఒక ప్రమాణ పత్రంలో సీబీఐ సమర్పించినట్టు బయటపెట్టారు. గత ఏడాది చివరిలోనే ఈ పత్రాలను సీబీఐ దాఖలు చేసిందనీ, గాలి జనార్థన్ రెడ్డిపై ఉన్న కేసులను సమాధి చేసేందుకు వీలుచ్చే విధంగా ఈ పత్రాలు తయారు చేశారంటూ.. ఆ డాక్యుమెంట్స్ ని ట్వీట్టర్ ద్వారా భర్కాదత్ విడుదల చేశారు.
గాలి జనార్థన్ రెడ్డి కర్ణాటక, గోవాలో ఎప్పుడెప్పుడు మైనింగ్ చేశారో, తవ్వి తీసిన ఖనిజాన్ని ఏవిధంగా తరలించారో అనేది స్పష్టంగా చెప్పడం కష్టమంటూ సీబీఐ కోర్టుకు దాఖలు చేసిన పత్రాల్లో పేర్కొందట. ఈ డాక్యుమెంట్స్ ని గత ఏడాదే కోర్టులో సీబీఐ సమర్పించినప్పటికీ, వీటిలోని పొందుపరిచిన ఈ వివరాలు ఇంతవరకూ బయటకి రాలేదు. వీటిని తాజాగా భర్కాదత్ బయటపెట్టడం విశేషం.
నిజానికి, భాజపా కేంద్రంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచే గాలి జనార్థన్ రెడ్డికి ఊరట ఖాయమని అందరూ అనుకున్నారు. బలమైన సాక్ష్యాలను సీబీఐ నమోదు చేసి, నాలుగేళ్లపాటు జైల్లోంచి బయటకి రాలేని విధంగా కేసు నడించింది. కానీ, బీజేపీ అధికారంలోకి వచ్చాక.. గాలికి బెయిల్ వచ్చేసింది. ఇదిగో.. గత ఏడాది ఇలాంటి పత్రాలు దాఖలయ్యాయి. ఇప్పుడు, కర్ణాటక ఎన్నికల్లో అక్రమ మైనింగ్ కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొన్న దాదాపు పదిమంది గాలి కుటుంబ సభ్యులకు భాజపా ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చేసింది. ఈ మధ్యనే… గాలి జనార్థన్ రెడ్డి అవినీతిని క్షమించేస్తున్నా అంటూ సీఎం అభ్యర్థి ఎడ్యూరప్ప వ్యాఖ్యానించారు! అవినీతిని క్షమించేయడమేంటీ..? క్షమించడానికి ఈయనెవరు..? కర్ణాటక ఎన్నికల ప్రచార నేపథ్యంలోనే.. భాజపా అధ్యక్షుడు అమిత్ షా కూడా ఓ సందర్భంలో మాట్లాడుతూ… ఎడ్యూరప్పతో సహా కొంతమందిపై అవినీతి ఆరోపణలున్నాయనీ, కానీ నిరూపణ జరగలేదన్నారు. ఇంకేముంది… గాలి జనార్థన్ రెడ్డికి త్వరలో క్లీన్ చిట్ వచ్చేసినా.. ఆశ్చర్యపోనక్కర్లేదేమో! సో.. ఇదండీ, అవినీతిపై అలుపెరగకుండా మోడీ సర్కారు సాగిస్తున్న తిరుగులేని పోరాటం!