తెలంగాణలో బీజేపీ ఎందుకు రాజకీయం చేస్తోందంటే.. కేవలం కాంగ్రెస్ పార్టీని ఓడించడానికే. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే.. దేశ రాజకీయాల్లో పెను మార్పులు వస్తాయని.. అది తమ పీఠం కిందకు నీళ్లు తెస్తుందని భయపడిపోతున్నారు. అందుకే బీఆర్ఎస్ పార్టీకి లేనిపోని ఐడియాలు ఇచ్చి మరీ సహకరిస్తున్నారని చెబుతున్నారు.
ఎన్నికల్లో ఆర్థిక అవసరాల గురించి చెప్పాల్సిన పని లేదు. పదేళ్లుగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు ఆర్థికంగా లోటు లేదు. ములుగు లాంటి చోట్ల నోట్ల కట్టల వరద పారుతోందంటే వారి ఆర్థికి సౌలభ్యాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. కానీ కాంగ్రెస్ నేతలకు ఏ చాన్స్ ఉండనీయడం లేదు. వారి ఆర్థికమూలాల్ని కట్టడి చేస్తున్నారు. ఐటీ, ఈడీలతో విస్తృతంగా దాడులు చేస్తున్నారు. పీయూష్ గోయల్, కేటీఆర్ కలిసి ఈ కుట్రలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇద్దరూ సమావేశం అవుతున్నారని అంటున్నారు.
ఈ వైపు కాంగ్రెస్ అభ్యర్థులకు డబ్బులు అందకుండాచేయడమే కాదు.. బీఆర్ఎస్ తరపున ఓటర్లకు అధికారికంగా డబ్బులు పంచే కార్యక్రమానికీ అనుమతి ఇచ్చింది. బీజేపీ సహకారం లేకపోతే రైతు బంధు పథకానికి నిదులను విడుదల చేసే అవకాశమే వచ్చేది కాదు. నిబంధనల ప్రకారం.త.. ఈసీ పోలింగ్ కు ముందు ప్రభుత్వ పథకాలైనా సరే మంజూరు చేసేందుకు అంగీకరించదు. పోలింగ్ ముగిసిన తరవాతనే చేసుకోమంటుంది. కానీ ఇక్కడ పోలింగ్ కు ఐదు రోజుల ముందు నగదును జమ చేయడానికి పర్మి,షన్ ఇచ్చింది. అది కూడా అరవై లక్షల మంది ఖాతాల్లో నగదు జమ చేయడానికి. బీజేపీ సహకారం లేకపోతే సాధ్యం కాదని అందరికీ తెలుసు.
తెలంగాణలో కాంగ్రెస్ పుంజుకుందని.. ఆ పార్టీ గెలిస్తే.. దేశవ్యాప్తంగా బీజేపీ బలహీనపడుతుందన్న కారణంగానే బీఆర్ఎస్ విజయానికి బీజేపీ సహకరిస్తోందని చెబుతున్నారు. కనీసం హంగ్ అయినా తెచ్చుకుందామన్న తమ వ్యూహాలన్నీ ఫెయిల్ కావడంతో చివరికి బీఆర్ఎస్ ను గెలిపించడానికి బీజేపీ పెద్దలు టాస్క్ తీసుకున్నారన్న విమర్శలు కాంగ్రెస్ వైపు నుంచి వస్తున్నాయి.