తెలంగాణ బీజేపీకి ఏదీ కలసి రావడం లేదు. ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల ఆగ్రహాన్ని కూడా చూడాల్సి వస్తోంది. ఆర్టీసీని .. ప్రభుత్వంలో విలీనం చేయాలని కేసీఆర్ నిర్ణయించారు. కేబినెట్ లో నిర్ణయం తీసుకుని .. హుటాహుటిన బిల్లు తయారు చేయించి.. గవర్నర్కు పంపారు. కానీ గవర్నర్ ఎప్పట్లాగే తన వద్దే అట్టి పెట్టుకున్నారు. విషయం బయటకు రావడం…. అసెంబ్లీ సమావేశాలను నేడే ముగించాలని నిర్ణయించడంతో వివాదాస్పదమయింది. అర్థరాత్రి సమయంలో గవర్నర్ బిల్లును తిరిగి పంపించారు. తన సందేహాలను సమాధానాలు కావాలని లేఖ రాశారు.
అంటే ఇప్పుడు బిల్లు… మళ్లీ ప్రభుత్వానికి వచ్చింది. ఇవాళ అన్ని సందేహాలకు సమాధానాలిచ్చినా గవర్నర్ హైదరాబాద్లో లేరు. ఆమె వచ్చిన తర్వాతనే చూసి… బిల్లును ఆమోదించి… ప్రభుత్వానికి పంపుతారు. అప్పుడే బిల్లు పెట్టడానికి అవకాశం ఉంటుంది . దీంతో బీఆర్ఎస్ నేతలు ఆర్టీసీ ఉద్యోగుల్ని రంగంలోకి దింపారు. చలో రాజ్ భవన్ కు పిలుపునిచ్చేలా చేశారు. బస్సుల్ని రెండు గంటల పాటు నిలిపి వేయాలని కూడా నిర్ణయించారు. అయితే ఇలా ఉద్యోగులు.. రాజ్ భవన్ మీదకు వెళ్లడం అంటే.. చిన్న విషయం కాదు. అయితే … ఈ విషయాన్ని వీలైనంత రాజకీయం చేసుకోవడానికి బీఆర్ఎస్ గట్టిగా ప్రయత్నిస్తోంది.
ఇప్పుడు బీజేపీ ఆర్టీసీ కార్మికులకు మేలు చేయకుండా అడ్డు పడుతోందని బీఆర్ఎస్ నేతలు ఆరోపించడం ఖాయమే. దీన్ని డిఫెండ్ చేసుకోవడం… బీజేపీ నేతలకు ఇబ్బందికరం. అందుకే ఎలాంటి స్పందన వ్యక్తం చేయడం లేదు. అసలు ఆర్టీసీ బిల్లు లో ఏదో ఓ లొసుగు పెట్టి కేసీఆర్.. విలీనాన్ని ఆలస్యం చేస్తారని… బీజేపీ నేతలు నమ్ముతున్నారు. కానీ ఇప్పుడు ఆ ఆలస్యానికి కారణం తామేనని ఆరోపించే పరిస్థితి రావడం వారికి ఇబ్బందికరంగా మారింది.