సోషల్ మీడియా విషయంలో కేంద్ర ప్రభుత్వం చాలా దూకుడుగా వెళ్తోంది. తప్పుడు ప్రచారం చేస్తున్నారని… అవసరమైతే చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తోంది. ముఖ్యంగా ట్విట్టర్ విషయంలో కేంద్రం చాలా సీరియస్‌గా ఉంది. తాము చెప్పిన ట్విట్టర్ అకౌంట్లు బ్యాన్ చేయడం లేదని ఇప్పటికే… చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు పంపుతున్నారు. అయితే ట్విట్టర్ ఏ మాత్రం లొంగడం లేదు. దీంతో ప్రభుత్వ పెద్దల్లో అసహనం పెరిగిపోతోంది. సోషల్ మీడియా కంపెనీలు ఇక్కడ స్వేచ్చగా వ్యాపారం చేసుకుని డబ్బు సంపాదించవచ్చు కానీ.. తాము చెప్పినట్లుగా చేయాల్సిందేనన్న సంకేతాలను… పార్లమెంట్ వేదికగా రవిశంకర్ ప్రసాద్ పంపించారు. లేకపోతే… సహించబోమన్నారు.
రైతు ఉద్యమం సందర్భంగా సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ ప్రచారం జరుగుతోంది. ఆ పాజిటివ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కనిపిస్తోంది. దీంతో ప్రభుత్వం… అసహనానికి గురవుతోంది. వాటన్నింటినీ ఫేక్ న్యూస్‌గా స్పష్టం చేసి.. అలాంటి ట్వీట్లు ప్రచారం చేస్తున్న అకౌంట్లను బ్యాన్ చేయాలని కోరుతోంది. అయితే స్వంతంగా నిజ నిర్ధారణ చేసుకుంటున్న ట్విట్టర్ అంత తేలిగ్గా తాము అకౌంట్లను తొలగించబోమని స్పష్టం చేసింది. దీంతో కంపెనీలతో పాటు.. సోషల్ మీడియా యూజర్లపైనా ప్రభుత్వం బెదిరింపులకు దిగింది. తప్పుడు వార్తలను వ్యాపింప జేయడానికి, హింసను ప్రేరేపించడానికి సోషల్ మీడియాను దుర్వినియోగం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రవిశంకర్ ప్రసాద్ పార్లమెంట్‌లోనే హెచ్చరించారు.
నిజానికి ఫేస్ బుక్‌తో కేంద్రానికి ఎలాంటి పంచాయతీలు లేవు. ఫేస్ బుక్.. కేంద్రం చెప్పినట్లుగా అకౌంట్లన్నింటినీ ఫిల్టర్ చేస్తుంది. బీజేపీకి ఫేవర్‌గా ఏం చేయమన్నా.. చేస్తుంది. గతంలో జరిగింది అదే. పైగా ఫేస్ బుక్ ఇప్పుడు.. రిలయన్స్ వ్యాపార సామ్రాజ్యంలో వాటా కూడా కొనుగోలు చేసింది. దీంతో ఇప్పుడు ట్విట్టర్‌పైనే కేంద్రం ఆగ్రహం కనిపిస్తోంది. అయితే అసలు ఇక్కడ సమస్య అంతా.. కేంద్రం చెబుతున్న ఫేక్ న్యూస్‌తోనే వస్తోంది. చాలా వరకూ కేంద్రం నిజాలను… ఫేక్‌గా భావిస్తోంది. తమకు వ్యతిరేకంగా ఉన్న వన్నీ… ఫేక్‌గానే చెబుతోంది. అక్కడే సమస్య వస్తోంది. నిజాలను దాచే ప్రయత్నం ట్విట్టర్ చేయడం లేదు. ట్విట్టర్‌పై బ్యాన్ విధిస్తే.. ఇండియాలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడినట్లు అవుతుంది. అందుకే కేంద్రం యూజర్లపై హెచ్చరికలకు దిగింది.
నిజానికి ఇండియాలో ఇప్పుడు తీవ్రమైన నిర్బంధ పరిస్థితులు ఉన్నాయి. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు చేసి అధికారాలు పొందిన వాళ్లు కూడా… ఇప్పుడు అదే సోషల్ మీడియాను ఇతరులు తమకు వ్యతిరేకంగా ఉపయోగిస్తే సహించలేకపోతున్నారు. కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారు. దేశంలో అనేక ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు కేంద్రం కూడా.. అదే పని చేయబోతోందన్న సంకేతాలు పంపుతోంది.