తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు సరికొత్త రచ్చ ప్రారంభమైంది. దళిత బంధు పథకం కోసం దరఖాస్తు చేసుకోవాలంటూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండిసంజయ్ ఉద్యమం ప్రారంభించారు. బీజేపీ శ్రేణులు ఊరూరా వెళ్లి దరఖాస్తులు చేయించాలని ఆయన కార్యక్రమానికి రూపకల్పన చేశారు. రూ. పది లక్షలు ఇవ్వకపోతే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరిస్తున్నారు. ఈ ఉద్యమంపై మంత్రి కేటీఆర్ సెటైర్లు వేశారు. బండి సంజయ్ దరఖాస్తులు స్వీకరిస్తున్నది ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఇస్తమన్న రూ. 15 లక్షల కోసం అని.. మంచి ప్రయత్నం చేస్తున్నారని.. త్వరగా అందరికీ ఇప్పించాలని ట్వీట్ చేశారు. దరఖాస్తు దారులందరూ ఆయన్నే ఆడగాలన్నారు.
2014 ఎన్నికలకు ముందు భారతీయ జనతా పార్టీ నినాదం నల్లధనం వెనక్కితీసుకు వచ్చి రూ.15 లక్షలు ప్రతి ఒక్కరి అకౌంట్లో వేస్తామని చెప్పడం. అయితే ఆ తర్వాత నల్లధనం పేరు చెప్పి నోట్లనురద్దు చేశారు కానీ ఎలాంటి మనీ అకౌంట్లలో వేయలేదు. జన్‌ధన్ ఖాతాలు తెరిచిన వారందరూ ఎంతో ఆశగా చూశారు. కానీ ప్రభుత్వం వైపు నుంచి స్పందన రాలేదు. కానీ ఎన్నికల్లో ఎన్నో చెబుతాం.. అన్నీ ఇస్తామా ఏంటి అన్నట్లుగా బీజేపీ పెద్దలు ప్రకటనలు చేశారు. ఆ హామీని తర్వాతఎన్నికల్లో మర్చిపోయారు. కానీ విపక్షాలు మాత్రం విమర్శలు చేస్తూనే ఉంటాయి.
తాజాగా కేసీఆర్ రూ. పది లక్షలు దళితులకు ఇస్తామని ప్రకటించడంతో… అలా ఇవ్వలేరని ఇచ్చినా.. అందరికీ ఇవ్వలేరన్న ఉద్దేశంతో బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు దరఖాస్తుల ఉద్యమం ప్రారంభించింది. దీనికి కౌంటర్‌గా కేటీఆర్ గతంలో ఇచ్చిన రూ. పదిహేను లక్షల హామీని తెరపైకి తీసుకు వచ్చారు. బండి సంజయ్ పోరాటం.. కేటీఆర్ కౌంటర్ మధ్య.. ముందు ఎవరు హామీని అమలు చేస్తారోనని నెటిజన్లు చర్చలు ప్రారంభించారు. రాజకీయ పార్టీలన్నీ ఇలా మభ్య పెడతాయని ఇవ్వవని మరికొంందరు కామెంట్లు చేస్తున్నారు.