2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి దిగుతుంది. కానీ, ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందీ.. ఎవరి పొత్తుతో బరిలోకి దిగుతుందీ.. లేదంటే, సొంతంగా అన్ని చోట్లా పోటీ ఉంటుందా..? ఇంకా ఇలాంటి అంశాలపై స్పష్టత రాలేదు. ఆ మాటకొస్తే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఆ స్పష్టతతో లేరని చెప్పాలి. ఎన్నికల్లో జనసేన ఎంతమందిని పోటీకి దించుతుందనేది 2018 డిసెంబర్ లో నిర్ణయిస్తానని పవన్ ఇదివరకే ప్రకటన చేశారు. అంతవరకూ పార్టీ నిర్మాణమే జరుగుతుందనీ, ప్రజల్లోకి వెళ్లి సమస్యలు తెలుసుకోవడంపై ప్రత్యేక శ్రద్ధ పెడతామని అనేశారు. దీంతో ఒక విషయం బాగా స్పష్టమైంది! అదేంటంటే… జనసేన రాజకీయంగా ఎటువైపు అడుగులు వేస్తుందని తెలుసుకోవాలంటే వచ్చే డిసెంబర్ వరకూ ఆగాలని! అయితే, ఈ నేపథ్యంలో భాజపా కూడా పవన్ కల్యాణ్ స్పష్టత కోసం ఎదురుచూస్తున్నట్టు ఓ కథనం ప్రచారంలోకి వస్తోంది. పవన్ విషయంలో కొన్నాళ్లపాటు వేచి చూస్తే బెటర్ అనీ, అంతవరకూ అంటీ ముట్టనట్టుగా ఉండాలనే ఉద్దేశంతో భాజపా ఉన్నట్టు, ఒక తాజా ఉదంతాన్ని దీనికి ఉదాహరణగా చెబుతున్నారు.
స్వచ్ఛతే సేవ పేరుతో దేశవ్యాప్తంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని భాజపా సర్కారు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగస్వాములు కావాలంటూ కొన్ని రంగాల ప్రముఖులకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేఖలు రాశారు. ముఖ్యంగా దేశంలోని సినీ రంగ ప్రముఖులకు ఈ లేఖలు అందాయి. అనిల్ కపూర్, మోహన్ లాల్, అనుష్క శర్మ, తెలుగు పరిశ్రమకి చెందిన దర్శకుడు రాజమౌళి, మహేష్ బాబు, ప్రభాస్ లకు ప్రధాని లేఖలు అందాయి. అయితే, ఈ క్రమంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కు ప్రధాని నుంచి ఇంకా లేఖ అందకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అందరితోపాటూ పవన్ కు మోడీ ఉత్తరం ఎందుకు రాలేదు అనే అంశంపై రకరకాల విశ్లేషణలు మొదలైపోయాయి! జనసేన రాజకీయ భవిష్యత్తుపై ఇంకా స్పష్టత ఇవ్వకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది!
వచ్చే ఎన్నికల్లో పవన్ కల్యాణ్ తో కలిసి సాగేందుకు భాజపా దాదాపు సిద్ధమే. ఆంధ్రాలో భాజపాకి పవన్ లాంటి ఒక స్టార్ కేంపెయినర్ అవసరం కచ్చితంగా ఉంది. అయితే, పవన్ ధోరణి మాత్రం వేరేలా ఉంటోంది! వామపక్షాలకు దగ్గరయ్యే ప్రయత్నంలో ఆయన ఉన్నారు. ప్రత్యేక కూటమి కట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ అదే జరిగితే.. జనసేనను పూర్థిస్థాయిలో విపక్షంగా భాజపా చూడటం అనేది తథ్యం. అలాగని, పొత్తుల విషయమై పవన్ ప్రస్తుతానికి ఏదీ తేల్చడం లేదు కాబట్టి.. కొన్నాళ్లు వేచి చూసే ధోరణిలోనే భాజపా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆ ఉద్దేశంతోనే పవన్ కు అంటీ ముట్టనట్టుగా ఉండాలన్నది ప్రస్తుత భాజపా వ్యూహమనీ, పవన్ కు స్వచ్ఛతే సేవలో భాగస్వామ్యం కావాలంటూ లేఖ పంపకపోవడం వెనక కారణం కూడా ఇదేనంటూ కొన్ని అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ కాస్త ఆలస్యంగా పవన్ కు లేఖ పంపినా… ఆ ఆలస్యం వెనక ఉన్న కారణాన్ని ఇలానే చూడొచ్చనేది కొంతమంది అభిప్రాయం. వామపక్షాలకు పవన్ మరింత దగ్గర అయితే.. జనసేనను భాజపా మరింత దూరం పెట్టే అవకాశాలున్నట్టు మాత్రం అర్థం చేసుకోవచ్చు. అదే విషయమై ఇప్పట్నుంచే జనసేనకు భాజపా సంకేతాలు ఇస్తున్నట్టుగా కూడా ప్రస్తుత పరిస్థితిని చూడొచ్చు.