నాగార్జున సాగర్ ఉపఎన్నికలో గెలిచి… ప్రత్యామ్నాయం తామే అని నిరూపించుకోవాలని తాపత్రయ పడుతున్న బీజేపీ..సొంత పార్టీ నేతల్ని నమ్ముకోవడం లేదు. బయట నుంచి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తోంది. ఇది ఆ పార్టీలో కలకలానికి కారణం అవుతోంది. నాగార్జున సాగర్‌లో ఇప్పటి వరకూ ఆ పార్టీకి ఓటు బ్యాంక్ లేదు… కానీ నేతలు మాత్రం ఉన్నారు. కడారి అంజయ్య యాదవ్ , నివేదితారెడ్డితో పాటు మరో ముగ్గురు నేతలు ఉన్నారు. వీరందరూ ఎవరి స్థాయిలో వాళ్లకు గాడ్ ఫాదర్లు ఉన్నారు. అయితే వీరందరూ కాదు..బయట నుంచి బలమైన నేతను తేవాలని బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారు.
గత ఎన్నికల్లో నివేదితా రెడ్డి అనే నేత పోటీ చేశారు. ఆమెకు మూడు వేల లోపు ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇప్పుడు బీజేపీకి కొంత క్రేజ్ వచ్చింది కాబట్టి తన బలంతో ఖచ్చితంగా గెలిచి తీరుతానని.. టిక్కెట్ తనకే ఇవ్వాలని ఆమె కోరుతున్నారు. సాగర్‌కు తమ పార్టీ తరపున ఇంచార్జ్‌గా సూర్యాపేట నేత సంకినేని వెంకటేశ్వరావును నియమించారు. ఆయన బీసీ నేతకు టిక్కెట్ ఇప్పించాలన్న ప్రయత్నంలో ఉన్నారు. అంజయ్య యాదవ్ వైపు ఆయన మొగ్గు చూపుతున్నారు. దీంతో నివేదితా రెడ్డి భగ్గుమంటున్నారు. నిజానికి అంజయ్య యాదవ్ సర్పంచ్‌గానే గెలవలేదు. అదే విషయాన్ని బీజేపీ పెద్దల దృష్టికి తీసుకెళ్తున్నారు.
కాంగ్రెస్ నుంచి జానారెడ్డి పోటీలో ఉంటున్నారు. టీఆర్ఎస్ తేరా చిన్నప్పరెడ్డికి టికెట్ ఇస్తోందన్న చర్చ నడుస్తోంది. అందుకే బీసీకే టిక్కెట్ ఇవ్వాలని కొంత మంది పట్టుబడుతున్నారు. చనిపోయిన నరసింహయ్య కూడా యాదవ సామాజికవర్గానికి చెందినవారు. అయితే బీజేపీ ఈ కుల సమీకరణాల కన్నా.. అభ్యర్థిపై ఎక్కువగా ఫోకస్ చేసుకుంటోంది. చివరికి బీజేపీలో చేరుతానని ప్రకటించిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పేరును కూడా పరిశీలిస్తోంది. ఆయన ఇప్పటికే ఎమ్మెల్యే. అయితే రాజీనామా చేయించి.. సాగర్ నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందా అని బండి సంజయ్ పరిశీలిస్తున్నారంటున్నారు. పార్టీకి కొద్దిగా క్రేజ్ పెరిగితే వచ్చే తిప్పలు ఇలానే ఉంటాయని బీజేపీ నేతలు అనుకుంటున్నారు.