ఖమ్మం లోక్ సభ నియోజకవర్గంలో టీడీపీని పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఖమ్మంలో ప్రస్తుతం తిరుగులేని ఆధిక్యంలో కాంగ్రెస్ ఉంది. బీఆర్ఎస్ బలహీనపడటంతో.. నామా నాగేశ్వరరావు నిలబడినా కష్టమేనన్న అభిప్రాయం వినిపిస్తోంది. ఇక బీజేపీకి అభ్యర్థి కాదు కదా క్యాడర్ కూడా లేదు. అందుకే బీజేపీ.. పొత్తుల్లో భాగంగా టీడీపీని పోటీ చేయాలని కోరుతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది.
టీడీపీ పోటీ చేస్తే కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇవ్వొచ్చని సర్వేలు తేల్చడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా చెబుతున్నారు. సిట్టింగ్ ఎంపీ నామా నాగేశ్వరరావు టీడీపీ, బీజేపీ కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తే మరింత మెరుగైన ఫలితం వస్తుందని అనుకుంటున్నారు. ఖమ్మంలో టీడీపీకి టికెట్ ఇస్తే, గ్రేటర్ హైదరాబాద్‌లో ఆ ప్రభావం కనిపిస్తుందని, ఓటు బ్యాంకు పెరిగే అవకాశం ఉన్నదని బీజేపీ హైకమాండ్ లెక్కలు వేస్తోంది.
బీజేపీ ఇప్పటి వరకు 15 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా వరంగల్, ఖమ్మం మాత్ర మే పెండింగులో ఉన్నాయి. రెండు రోజుల క్రితం బీజేపీలో చేరిన అరూరి రమేశ్‌కు వరంగల్ టికెట్ ఇవ్వడం ఖాయమన్న ప్రచారం జరుగుతుండగా, మిగిలిన ఖమ్మం సీటును విషయంలో మాత్రం క్లారిటీ లేదు. ఇటీవల జలగం వెంకట్రావును పార్టీలో చేర్చుకున్నారు. కానీ ఆయనకు టిక్కెట్ ఖరారు చేయలేదు. ఇప్పుడు ఆయనకు టిక్కెట్ ఖరారు చేస్తే తెలంగాణలో టీడీపీ పోటీ చేసే చాన్స్ ఉండదు. కానీ.. టీడీపీకి కేటాయిస్తే మత్రం రాజకీయాలు మారిపోయే అవకాశం ఉంది.