బీజేపీ..రేవంత్ సర్కార్ కు మళ్లీ హెచ్చరికలు పంపింది. ఎమ్మెల్సీ ఎన్నికలు కీలక మలుపుకు శ్రీకారం చుట్టబోతున్నాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీజేపీ నేత లక్ష్మణ్. ఎంపీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ తో పోటీపడి మరీ 8 స్థానాల్లో గెలుపుబావుటా ఎగరేసిన తర్వాత ఆగస్ట్ సంక్షోభంతప్పదని..ప్రభుత్వాన్ని కూల్చివేస్తామనే తరహాలో వార్నింగ్ ఇచ్చిన బీజేపీ..తాజాగా మరోసారి ఈ కామెంట్స్ చేయడం రాజకీయ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది.
బీజేపీ అగ్రనేతలతో కీలకంగా ఉండే లక్ష్మణ్ మరోసారి ఈ కామెంట్స్ చేశారు. త్వరలో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకు నాంది కాబోతున్నాయని చెప్పుకొచ్చారు. అది ఎలాంటి మలుపో బీజేపీ నేతలకన్నా ప్రత్యర్థి పార్టీల నేతలకూ పక్కాగా తెలుసు. అంటే మళ్లీ రేవంత్ సర్కార్ కు హెచ్చరికలు పంపడమే.
ఉమ్మడి కరీంనగర్-మెదక్-ఆదిలాబాద్-నిజామాబాద్ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ, వరంగల్-ఖమ్మం-నల్గొండ ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు బీజేపీ శాయశక్తులా ప్రయత్నిస్తోంది. పైగా బీఆర్ఎస్ పోటీలో లేకపోవడం కూడా బీజేపీకి అదనపు బలమే అనుకోవచ్చు. ఇప్పటికే వరుసగా ఆయా రాష్ట్రాల ఎన్నికల్లో గెలుపు, ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే బీజేపీకి పట్టపగ్గాలు లేకుండా పోవడం ఖాయం.
ఎంపీ ఎన్నికల్లో వచ్చిన గెలుపు కిక్ ను బీజేపీ సరిగా క్యాష్ చేసుకోలేదు అనే కంప్లైంట్ ఆ పార్టీపై ఉంది. ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిస్తే లక్ష్మణ్ అన్నట్లు దూకుడు పెంచే అవకాశం మాత్రం ఉంది. అది ఏ రూపంలో ఉండనుందో చూడాలి.