ఎన్నికలు దగ్గరకు వస్తున్నాయి. తెలంగాణలో ఎవరూ ఊహించని మలుపులు చోటు చేసుకుంటున్నాయి. బీఆర్ఎస్కు అధికార పార్టీ అనే అడ్వాంటేజ్ లేకుండా పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత ఎన్నికల్లో ఏపీలో తెలుగుదేశం పార్టీకి ఏర్పడిన పరిస్థితి ఇప్పుడు బీఆర్ఎస్కు ఏర్పడుతోంది. ఎన్నికల నోటిఫికేషన్ రాకుండానే… ఎన్నికల సంఘం చేతికి అధికారం పోకుండా చీఫ్ సెక్రటరీని గెంటివేసినంత పని చేశారు. అదీ కూడా ఇతర ఐఏఎస్ లు టెన్షన్ పడే రేంజ్లో ఈ పరిణామం చోటు చేసుకుంది.
స్వయంగా పోలీస్ బాస్ అంజనీకుమార్ కూడా ఏపీ క్యాడర్ అధికారి. ఆయనతో పాటు దాదాపుగా పది మంది వరకూ ఏపీకి కేటాయించినప్పటికీ ఇంకా తెలంగాణలోనే కొనసాగుతున్నారు. క్యాట్ కు వెళ్లి ఆదేశాలు తెచ్చుకుని ఉంటున్నారు. ఇలాంటి వారు కీలక పొజిషన్లలో ఉన్నారు. ఇప్పుడు సోమేష్ కుమార్ వ్యవహారంతో వారంతా టెన్షన్ పడక తప్పదు. సీనియర్ సివిల్ సర్వీస్ అధికారులు ప్రభుత్వానికి మద్దతుగా ఉంటున్నారని.. కొద్ది రోజులుగా తెలంగాణ బీజేపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సోమేష్ పై వేటు వేయడం ద్వారా.. ఇతర అధికారులకు స్పష్టమైన సందేశాన్ని బీజేపీ పంపినట్లయిందన్న వాదన వినిపిస్తోంది.
కేంద్ర ప్రభుత్వానికి ఫేవర్‌గా ఉండటానికి సివిల్ సర్వీస్ అధికారులు సిద్ధపడకపోతే ఎంత దారుణమైన పరిస్థితులు ఉంటాయో గత ఎన్నికల్లో టీడీపీ చూసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చాక సీఎస్‌ను మార్చేసి.. ఎల్వీ సుబ్రహ్మణ్యంకు చాన్సిచ్చింది. అయన మొత్తం ఎన్నికల నిర్వహణను హైజాక్ చేసేశారు. తర్వాత జరిగిన కథేమిటో అందరికీ తెలుసు.
ఎమ్మెల్యేలకు ఎర కేసులో ఇద్దరు సీనియర్ పోలీసు అధికారులు సీబీఐ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు డీజీపీ కూడా ఏపీ క్యాడర్ వివాదంలో ఉన్నారు. ఇప్పుడు తెలంగాణలో అసలు ఎన్నికలకు ఇంకా పది నెలల వరకూ సమయం ఉండాగనే.. అధికార యంత్రాంగానికి బీజేపీ డైరక్ట్ హెచ్చరికలు పంపినట్లయింది. ఇప్పుడు అధికారులపై పట్టు కొనసాగించడం బీఆర్ఎస్ చీఫ్‌కు సవాల్ లాంటిదే.