ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ అధికార పార్టీపై పోరాటానికి ఓ కొత్త అంశాన్ని ఎంపిక చేసుకుంది. దేవాదాయ భూములను.. ఏపీ సర్కార్ స్వాధీనం చేసుకునే ప్రయత్నంలో ఉండటంతో.. ఆ దిశగా.. ఇప్పటికే తమ పోరాట ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉగాది రోజు పాతిక లక్షల పేద కుటుంబాలకు ఇళ్ల స్థలాలు పంపిణీ చేయాలని.. ఏపీ సర్కార్ నిర్ణయించింది. ఇందు కోసం.. స్థలాలను సమీకరించే ప్రయత్నంలో ఉంది. అయితే.. పాతిక లక్షల మందికి ఇళ్ల స్థలాలిచ్చే స్థాయిలో ప్రస్తుతం ప్రభుత్వం వద్ద భూములు లేవు. అందుకే.. దేవాదాయ శాఖ.. ఆ శాఖ అధీనంలో ఉన్న ఆలయాల పేరుపై ఉన్న భూముల లెక్కలను బయటకు తీస్తోంది. దాదాపుగా పదకొండు వేల ఎకరాలు.. దేవాదాయశాఖకు చెందిన ఆలయాల వద్ద ఉన్నాయని అంచనా.
దేవాలయాల భూముల ద్వారా.. పేదలకు ఇళ్ల స్థలాలు అనే.. పథకాన్ని కొంత వరకు అయినా… నెరవేర్చవచ్చనే ఆలోచనలో ఏపీ సర్కార్ ఉంది. ఈ మేరకు.. స్థల పరిశీలన చేయమని ఉత్తర్వులు కూడా ఇచ్చింది. రెవిన్యూ శాఖ వర్గాలు.. ఇప్పటికే మార్కింగ్ కూడా ప్రారంభించినట్లుగా చెబుతున్నారు. ఈ క్రమంలో బీజేపీ నేతలు ప్రభుత్వంపై తీవ్రమైన విమర్శలతో దాడి ప్రారంభించారు. మాజీ మంత్రి మాణిక్యాల రావు.. దేవాలయ భూముల జోలికి వస్తే.. సహించబోమని ప్రభుత్వానికి ముందస్తుగా హెచ్చరిక జారీ చేశారు. దేవాలయ భూములపై ప్రభుత్వ కన్ను పడిందని… పేదల ఇళ్ల కోసం.. చర్చిలు, మసీదుల స్థలాలు స్వాధీనం చేసుకోవాలనే ఆలోచన ఎందుకు చేయరని ప్రశ్నిస్తున్నారు. దేవాలయాల ధ్వంసానికి కుట్ర జరుగుతోందని మాణిక్యాలరావు మండిపడ్డారు.
దేవాదాయ భూముల విషయంలో… ప్రభుత్వం ఇంకా అధికారికంగా ప్రకటన చేయలేదు. కేవలం ఎన్ని భూములు అందుబాటులో ఉన్నాయో.. లెక్క తీయాలని మాత్రమే ఆదేశించింది. ఒక వేళ నిజంగా.. దేవాదాయ భూములను తీసుకుని పేదలకు ఇళ్ల స్థలాలుగా పెంచాలంటే.. మాత్రం.. రాజకీయ దుమారం రేగే అవకాశం ఖాయంగా కనిపిస్తోంది. ఈ విషయంలో భారతీయ జనతా పార్టీ.. మరింత దూకుడుగా వ్యవహరించడం ఖాయమేనని మాణిక్యాల రావు ప్రకటనతోనే తేలిపోతోంది.