సెలెబ్రిటీలకు బెదిరింపులు, ఫత్వాలు పెరిగిపోతున్నాయి. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కు బెదిరింపులు మొదలయ్యాయి. టిప్పు సుల్తాన్ పాత్రలో నటించవద్దంటూ బీజేపీతో పాటు పలు తమిళ, హిందూ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. కన్నడ సినిమా నిర్మాత అశోక్ ఖేనీ అలనాటి మైసూర్ సుల్తాన్ టిప్పు సుల్తాన్ పై సినిమా తీయాలని నిర్ణయించారు. ఇందులో టిప్పు పాత్రకు రజనీకాంత్ అయితే బాగుంటుందని అనుకున్నారు. ఈ విషయమే ఇటీవల ప్రకటించారు. అంతే, టిప్పు తమిళ వ్యతిరేకి కాబట్టి అందులో నటించవద్దంటూ మొదట కొన్ని తమిళ పార్టీలు రజనీ కాంత్ ను హెచ్చరించాయి.
ఇప్పుడు బీజేపీ నాయకులు చాలా మంది రజనీ ఈ సినిమా చేయవద్దని కామెంట్స్ చేశారు. టిప్పు ఓ నరహంతకుడని, అలాంటి వ్యక్తి పాత్రలో నటించ వద్దని ప్రకటనలు చేస్తున్నారు. విశ్వహిందూ పరిషత్ ఇతర సంఘాల నేతలైతే రజనీకాంత్ ఆ సినిమా చేయడానికి వీల్లేదంటూ బెదిరిస్తున్నారు. రజనీకాంత్ సెక్రటరీ మాత్రం అసలు ఆ ప్రస్తావనే లేదని, రజనీ ఆ సినిమా ఒప్పుకోవడం కాదుకదా కనీసం కథను కూడా వినలేదని చెప్పారు. నిర్మాత మాత్రం తాను టిప్పు పాత్ర గురించి రజనీతో మాట్లాడానని చెప్పారు. అలా మాట మాత్రంగా కాకుండా స్క్రిప్టుతో రావాలని రజనీ చెప్పారని వివరించారు. టిప్పు సుల్తాన్ చెడ్డవాడే అయితే పాఠ్య పుస్తకాల్లో ఆయన గురించి పాఠాలు ఎందుకున్నాయని నిర్మాత ప్రశ్నించారు. టిప్పు సుల్తాన్ హిందూ దేవాలయాల నిర్మాణాన్ని ప్రోత్సహించాడని తాను విన్నానని ఆయన గొప్ప రాజు అని చెప్పారు.
మొత్తానికి ఈ వివాదం ఫలితంగా టిప్పు పాత్రలో రజనీకాంత్ నటిస్తారా లేదా అనేది సస్పెన్స్ గా మారింది. ఈ బెదిరింపులకు రజనీ ఎలా స్పందిస్తారో చూద్దాం.