తెదేపా ఎంపీ రాయపాటి సాంబశివరావు బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోవడానికి భలే కారణం చెప్పారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయకపోవడంతో రాష్ట్ర ప్రజల ఉసురు బీజేపీకి తగిలినందునే బిహార్ ఎన్నికలలో ఓడిపోయిందని అన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, ఆర్ధిక ప్యాకేజి ఇస్తారని ప్రజలు అందరూ ఆశగా ఎదురు చూస్తే ప్రధాని నరేంద్ర మోడి డిల్లీ నుంచి పిడికెడు మట్టి, చెంబుడు నీళ్ళు తెచ్చి చంద్రబాబు నాయుడు చేతిలో పెట్టి వెళ్లిపోయేరని విమర్శించారు. ఆంద్ర ప్రజల ఉసురు తగిలడం వలననే బిహార్ ఎన్నికలలో బీజేపీ ఓడిపోయిందని అన్నారు. బిహార్, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ప్రజలు అడగక పోయినా లక్షల కోట్లు ఇవ్వజూపిన ప్రధాని నరేంద్ర మోడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ప్రత్యేక హోదా, నిధులు కోసం పదేపదే అడుగుతున్నా ఎందుకు మంజూరు చేయడం లేదని రాయపాటి ప్రశ్నించారు.ఇకనయినా మోడీ తన తప్పును సరిదిద్దుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చిన అన్ని హామీలను అమలుచేసి రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరారు. రాయపాటి చెప్పిన విషయాన్ని మోడీ కాస్త చెవికెక్కించుకొంటే మంచిదే…లేకుంటే మళ్ళీ వచ్చే ఏడాది పశ్చిమ బెంగాల్, తమిళనాడు రాష్ట్రాలలో బీజేపీ ఎన్నికలను ఎదుర్కోవలసి ఉంది కదా!