ఆంధ్రప్రదేశ్ బీజేపీ ప్రభుత్వంపై పోరాడి ప్రజల్లో ఆదరణ పెంచుకునేందుకు వరుసగా కార్యక్రమాలు చేపడుతోంది. ఇటీవల యువ సంఘర్షణ యాత్రలను నిర్వహించారు. తాజాగా ప్రజాపోరు పేరుతో ఐదు వేల సభలు ఏర్పాటు చేయాలని.. ప్రజల్లోకి విస్తృతంగా వెళ్లాలని నిర్ణయించుకున్నారు. కానీ వారి యాత్రలు.. పర్యటనలు.. రాజకీయాలను ప్రజలు సీరియస్‌గా తీసుకోవడం లేదు. దీనికి కారణం… కేంద్రానికి ఉన్న పవర్‌ను ఇతర రాష్ట్రాల్లో ఎలా ఉపయోగిస్తున్నారో కళ్లముందు కనిపిస్తూనే ఉంది. కానీ ఏపీలో మాత్రం జగన్‌కు పూర్తి స్థాయిలో సహకరిస్తున్నారు. రాష్ట్రం నాశనం అయిపోవడానికి సహకరిస్తున్నారన్నఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తోంది.
ప్రో వైసీపీ ఇమేజ్ వదిలించుకోవాలంటే కేంద్రం.. ఏపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేయాల్సిన పని లేదు. నిబంధనల ప్రకారం ఉంటే చాలు. కానీ అప్పుల లెక్కలు చెప్పకపోయినా… సీబీఐపైనే ఎదురు కేసులు పెట్టినా చోద్యం చూస్తోంది. న్యాయవ్యవస్థపై దాడులు చేస్తున్నా కేంద్రం నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటోంది. ఇలాంటి పరిణామాలతోనే ఏపీ బీజేపీకి ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అయితే ఇటీవల హైకమాండ్ .. ప్రభుత్వంపై పోరాడమని చెప్పినట్లుగా ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. అందుకే బీజేపీ నేతలు విరుచుకుపడుతున్నారు. ప్రభుత్వ వ్యతిరేక పోరాటంలో ముందుంటున్నారు.
అయితే కేంద్రం కూడా కఠినంగా వ్యవహరిస్తేనే ఏపీలో బీజేపీ నేతలు చేసే పోరాటలకు విలువ ఉంటుంది. వీరు ఇక్కడ ఎంత పోరాడినా వైసీపీ తీసుకునే నిర్ణయాలు.. లేదా చేస్తున్న తప్పులను ఒక్క సారి సమర్థిస్తే వారి శ్రమ అంతా బూడిదలో పోసిన పన్నీరయిపోతోంది. ఇప్పటి దాకా జరిగింది ఇదే. ఇప్పటికైనా హైకమాండ్ వారి మాట వింటుందో లేదో మరి!