నరేంద్ర మోడీ ప్రభుత్వం కేంద్రంలో రెండేళ్ళ పాలన పూర్తి చేసుకొన్న సందర్భంగా భాజపా నేతలు, కేంద్ర మంత్రులు, భాజపా ముఖ్యమంత్రులు ‘భాజపా వికాస్ యాత్ర’ పేరిట దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో పర్యటిస్తూ మోడీ ప్రభుత్వం గొప్పదనాన్ని పొగుడుతున్నారు. ఎవరి గురించి వారు గొప్పగా ఊహించుకోవడం, గొప్పలు చెప్పుకోవడం సహజమే. ఆ పని మీదే మహబూబ్ నగర్ వచ్చిన ఛత్తీస్ ఘర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ నిన్న తెలంగాణా రాష్ట్ర అధ్యక్షుడు డా.లక్ష్మణ్ తదితర భాజపా నేతలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ చాలా విచిత్రమైన మాట చెప్పారు.
“ఒకప్పుడు అసోం రాష్ట్రంలో భాజపాకి కేవలం ఐదుగురు సభ్యులే ఉండేవారు. ఇప్పుడు ఆ రాష్ట్రంలో భాజపా అధికారంలోకి వచ్చింది. ప్రస్తుతం తెలంగాణాలో కూడా భాజపాకి ఐదుగురు సభ్యులే ఉన్నారు కనుక తెలంగాణాలో కూడా వచ్చే ఎన్నికలలో భాజపాయే గెలిచి అధికారంలోకి వస్తుందని చెప్పడానికి అదే మంచి సంకేతం,” అని అన్నారు.
వచ్చే ఎన్నికలలోగా తెలంగాణాలో భాజపాని బలోపేతం చేసుకొని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో పోరాడుతూ ప్రజల మనసులు గెలుచుకొని అధికారంలోకి రావాలని రమణ్ సింగ్ చెప్పి ఉంటే అది చాలా సహజమని భావించవచ్చు కానీ అసోంలో లాగే తెలంగాణాలో కూడా ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు కనుక భాజపా అధికారంలోకి వస్తుందని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉంది. ఒకవేళ ఆ ఫార్ములా పనిచేస్తుందనుకొంటే, అన్ని రాష్ట్రాలలోను ఏదోవిధంగా ఐదుగురు ఎమ్మెల్యేలను భాజపా గెలిపించుకొంటే సరిపోతుంది కదా?
అయినా అసోంలో ప్రజలు కాంగ్రెస్ పాలనతో విసుగెత్తిపోయున్నందున, కాంగ్రెస్ పార్టీకి భాజపా తప్ప వేరే బలమైన ప్రత్యామ్నాయం లేకపోవడం వలననే ఓట్లు వేసి గెలిపించారు. కానీ తెలంగాణాలో అత్యంత ప్రజాధారణ గల తెరాస ప్రభుత్వం అధికారంలో ఉంది. ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో వేగం, పారదర్శకత, అభివృద్ధి, సంక్షేమం అన్నీ కళ్ళకి కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆకాశ హర్మ్యాల నిర్మాణం వంటి ఆయన హామీలు మాటలకే పరిమితం అయినప్పటికీ, ప్రజలకుపయోగపడే రోడ్ల నిర్మాణం, చెరువుల పూడికతీత, ఇంటింటికి మంచి నీళ్ళ సరఫరా, విద్యుత్ సంక్షోభం నివారణ వంటివన్నీ తెరాస ప్రభుత్వానికి మంచి ప్రజాధారణ ఏర్పరిచాయి. కనుక ఏదో ఊహించని అద్భుతం జరిగితే తప్ప వచ్చే ఎన్నికలలో తెరాసను డ్డీకొని భాజపా గెలవడం అసాధ్యం. వచ్చే ఎన్నికలలో భాజపా కనీసం ఇప్పుడున్న ఆ ఐదు స్థానాలైన నిలబెట్టుకోవాలంటే ఇప్పటి నుంచే రాష్ట్ర భాజపా నేతలు అందరూ గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకోవడం మినహా మరో మార్గం లేదు. ఉండదు.