తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ తాము అధికారంలోకి వస్తే కొత్త సచివాలయం డోమ్‌లను కూల్చేస్తామని ప్రకటించారు. దీనికి ఆయన భారతీయ సంస్కృతి, సంప్రదాయాల టచ్ ఇచ్చారు. అసలు డోమ్‌లకు … ఆయన చెప్పిన దానికి ఏమైనా సంబంధం ఉందా ? అంటే… చరిత్రకారులు చెప్పాల్సిందే. ఆ చరిత్రలను కూడా ఇప్పుడు ఇష్టం వచ్చినట్లుగా మార్చేస్తున్నారు. కానీ ఇలాంటి నిర్మాణాలు భారతీయత కాదని ఎందుకు అనుకుంటున్నారో తెలియదు కానీ.. వస్తే కూల్చేస్తామని మాత్రం చెబుతున్నారు.
ఓ వైపు రేవంత్ రెడ్డి ప్రగతి భవన్ ను డైనమేట్లు పెట్టి పేల్చేస్తామని ప్రకటించారు. అది వివాదం అవుతూండగానే.. అలాంటి ప్రకటనలు చేయడానికి రేవంత్ రెడ్డి ఎవరు. .. చేస్తే గీస్తే తానే చేయాలనన్నట్లుగా బండి సంజయ్ తెర మీదకు వచ్చారు. డోమ్ లు ముస్లిం వర్గానికి లేదా ఇతర వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయని ఇప్పటి వరకూ ఎవరూ చెప్పలేదు. కనీసం అలాంటి ఆలోచన కూడా లేదు. బండి సంజయ్ కు మాత్రమే అలాంటి ఆలోచన వచ్చింది.
బండి సంజయ్ వ్యవహారం బీఆర్ఎస్ కు ఇటీవల ట్రోలింగ్ కు బాగా ఉపయోగపడుతోంది. ఢిల్లీలో బడ్జెట్ పై ఆయన స్పందించిన తీరును కేటీఆర్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి.. దేశం మొత్తం తెలిసేలా చేశారు ఓ ఎంపీ ఇంత అమాయకంగా ఉంటారా అని జనం అనుకునేలా చేశారు. ఇప్పుడు సచివాలయం డోమ్ ల విషయంలోనూ కూల్చివేత ప్రకటనలతోనూ అదే పరిస్థితి ఏర్పడింది. బండి సంజయ్ ఇలాంటి ప్రకటనలతో బీజేపీకి.. మేలు చేస్తున్నారా .. కీడా అన్నదానిపై స్పష్టత లేకుండా పోయింది. ఆ పార్టీలోని బండి సంజయ్ వ్యతిరేక వర్గం మాత్రం… ఆయన బుర్ర లేకుండా మాట్లాడి పార్టీకి నష్టం చేస్తున్నారని ఢిల్లీకి ఫిర్యాదులు పంపుతున్నారు.