అదిగో ఇదిగో.. ఆయనా ఈయానా అంటూ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ప్రకటనపై జాతీయ నాయకత్వం మీనమేషాలు లెక్కిస్తోంది. పార్టీ బాధ్యతల నుంచి కంభంపాటి హరిబాబు తప్పుకున్నా… ఇప్పటికీ అధ్యక్షుడిని నియామకం జరగలేదు. సోము వీర్రాజు పేరు దాదాపు ఖరారు అయిపోయిందన్నారు. అంతకుముందు, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావు పేరు ప్రకటనే ఆలస్యమనే లీకులూ వచ్చాయి. అయితే, ఇప్పుడీ అంశంపై ఢిల్లీలో భాజపా వర్గాలు ఆలోచించడమే లేదని సమాచారం!
దీనికి కారణం… కర్ణాటక ఎన్నికలు అనేది ఒకటైతే, రాష్ట్రంలో రోజురోజుకీ మారుతున్న భాజపాలో స్థితిగతులు కూడా మరొకటి. కర్ణాటక ఎన్నికలకు సర్వశక్తులూ ఒడ్డాల్సిన పరిస్థితి ఏర్పడింది. దక్షిణాదిలో వ్యక్తమౌతున్న మోడీ వ్యతిరేక పవనాలకు ఎదురీదాలనే ప్రయత్నంలో మోడీ, షా ద్వయం పట్టుదలతో ఉన్నారు. కాబట్టి, ఏపీ వ్యవహారాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం లేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి విషయమై ఎవర్ని నియమించినా, ఆ నిర్ణయాన్ని ప్రశ్నించే పరిస్థితి కూడా ఏపీ భాజపా నేతలకు లేదు. అలాగని, ఎవరో ఒకర్ని నియమించేసేంత ధైర్యం కూడా అమిత్ షా చేయలేకపోతున్నారు. కారణమేంటంటే.. రాష్ట్ర భాజపా వర్గాల నుంచి వ్యక్తమౌతున్న విచిత్ర పరిస్థితే..!
ఎన్డీయేతో టీడీపీ తెంచుకున్నాక.. ఏపీ రాష్ట్ర భాజపా నేతల వ్యవహార శైలి ఎవరికి వారే అన్నట్టుగా మారిన సంగతి తెలిసిందే. సీనియర్ నేత కన్నా తనదారి తాను చూసుకుంటున్నారు. తాజాగా మరో నేత పార్టీకి దూరమయ్యారు. ఈ తరుణంలో ఎవరో ఒకరికి అధ్యక్ష పదవి ఇచ్చేస్తే.. ఈ వలసల్ని ఆపొచ్చని కొంతమంది రాష్ట్ర నేతలు వాపోతున్నారు. అయితే, సోము వీర్రాజు పేరును ఖరారు చేసేద్దామనుకుంటున్న తరుణంలో… తాజాగా ఓ యాభై మంది ద్వితీయ శ్రేణి నాయకుల నుంచి అమిత్ షాకి ఉత్తరాలు వెళ్లాయట! వాటి సారాంశం ఏంటంటే… సోము వీర్రాజుకు పార్టీ బాధ్యతలు ఇవ్వొద్దని! దీంతో అధ్యక్ష నియామక నిర్ణయాన్ని వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. నిజానికి, సోము వీర్రాజుకి అధ్యక్ష బాధ్యతలు ఇస్తే పార్టీ నుంచి బయటకి వెళ్లిపోతా అని ఇప్పటికే ఆకుల సత్యనారాయణ హెచ్చరించిన సంగతీ తెలిసిందే. దీనికి తోడు ఢిల్లీకి ఏపీ నేతల లేఖలు వెళ్లాయి. దీంతో కర్ణాటక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకూ ఏపీ అధ్యక్ష పదవి విషయమై ఎవ్వరూ మాట్లాడొద్దంటూ ఏపీ నేతలకు సంకేతాలు అందినట్టు తెలుస్తోంది. అయితే, ఈలోగా పార్టీకి దూరమయ్యే వారిని ఎవరు బుజ్జగిస్తారనే ప్రశ్నా ఉండనే ఉంది..?