ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ పరాజయం తర్వాత…జాతీయ రాజకీయాల్లో ఓ స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. 2019 ఎన్నికల్లో ఏ విధంగా చూసినా బీజేపీ అధికారంలోకి రాలేదనే అభిప్రాయం బలపడటమే ఆ మార్పు. గత ఎన్నికల్లో సొంతంగా మెజార్టీ సాధించిన భారతీయ జనతా పార్టీకి.. ఈ సారి సొంతంగా వంద సీట్లు కూడా వస్తాయా రావా అన్నది సందేహంగా మారడమే దీనికి కారణం. కంచుకోటలుగా పేరు బడిన రాష్ట్రాల్లో ఈ సారి ఉనికి ప్రమాదంలో పడటమే దీనికి కారణం.
ఉత్తరప్రదేశ్లో 80 సీట్లు ఉంటే గత ఎన్నికల్లో బీజేపీ 71 స్థానాలను గెలుచుకుంది. ఇప్పటికే దశాబ్దాలుగా గెలుస్తూ వస్తున్న లోక్ సభ సీట్లను ఉపఎన్నికల్లో పోగొట్టుకుంది. ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్ కూటమిగా గెలిస్తే.. ఈ 71 సంఖ్య 20 కన్నా కిందకు దిగజారినా ఆశ్చర్యం లేదనేది చాలా మంది చెబుతున్న మాట. వారణాశిలో మోడీ గెలుపునకు గ్యారంటీ లేదని వస్తున్న విశ్లేషణలే దీనికి నిదర్శనం. యూపీలోనే బీజేపీ.. 40 నుంచి 50 సీట్లు కోల్పోతుంది. ఇక గుజరాత్, ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్లలో బీజేపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఇప్పుడు గుజరాత్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సగం సీట్లు వస్తే గొప్ప. ఢిల్లీలోనూ అంతే. జార్ఘండ్, ఉత్తరాఖండ్..లలోనూ అదే పరిస్థితి. గత ఎన్నికల్లో గెలిచిన వాటిలో సగం కూడా వచ్చే పరిస్థితి లేదు. ఈ రాష్ట్రాల్లో 80 సీట్లు వరకూ బీజేపీకి కోత పడతాయి.
ఇక కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రాజస్థాన్, మధ్య ప్రదేశ్, చత్తీస్ ఘడ్లలో బీజేపీ ఆశలు పెట్టుకోవడం కష్టమే. అధికారం చేపట్టిన కొత్తలో… ఎన్నికలు జరిగితే ఎలా ఉంటుందో.. ఇప్పటికే చాలా ఎన్నికలు నిరూపించాయి. ఈ మూడురాష్ట్రాల్లో కాంగ్రెస్కు గత ఎన్నికల్లో వచ్చింది ఒకే ఒక్క లోక్ సభ సీటు. ఇప్పుడు ఆ పరిస్థితి బీజేపీకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అంటే మరో అరవై సీట్లకు కోత పడిపోతుంది. ఇక మహారాష్ట్రలో బీజేపీ పరిస్థితి ఏమిటో ఆ పార్టీ నేతలకు అర్థం కావడం లేదు. శివసేనతో కలిసి పోటీ చేయాలంటే.. భారీగా సీట్లు సమర్పించుకోవాలి. అలా చేస్తే.. పార్టీకి నష్టం చేయకపోతే.. మొత్తానికే నష్టం. ఎలా చూసినా.. ఇక్కడ సీట్లు పెరిగే చాన్స్ లేదు. బీహార్ లో అయితే… గత లోక్ సభ ఎన్నికల్లో 22 చోట్ల బీజేపీ విజయం సాధించింది. ఈ సారి జేడీయూతో పొత్తు పెట్టుకుని 17 స్థానాల్లోనే పోటీ చేస్తోంది. అంటే సిట్టింగ్ స్థానాలు త్యాగం చేస్తోంది. ఈ సారి అక్కడ లాలూపై సానుభూతి కురవడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. అక్కడ కూడా సీట్ల కోతే.
దక్షిణాదిలో బలంగా ఉన్నామని బీజేపీ విర్రవీగుతున్న ఒకే ఒక్క రాష్ట్రం కర్ణాటక. కర్ణాటకలో గత ఎన్నికల్లో బీజేపీ 17మంది గెలిచారు. ఈ సారి ఏడు గెలిచినా కష్టమే. కాంగ్రెస్, జేడీఎస్ కలసి పోటీ చేస్తున్నాయి కాబట్టి… ఏడు గెలిస్తే చాలా ఎక్కువ. ఇక దక్షిణ భారత దేశంలో బీజేపీకి ఒక్క సీటు కూడా రాదు. తెలంగాణలో గత ఎన్నికల్లో ఒక్క సీటు వచ్చింది. ఈ సారి అది కూడా రాదు. ఏపీలో డిపాజిట్లు రావు. తమిళనాడులో సీటే లేదు. వచ్చే అవకాశం కూడా లేదు. కేరళలో కూడా అంతే. ఏపీ, తెలంగాణ, తమిళనాడు, కేరళల్లో ఉన్న 101 సీట్లలో బీజేపీకి ఒకటి, రెండు కూడా వస్తాయన్న గ్యారంటీ కూడా లేదు. ప్రతీ చోటా బీజేపీ కోల్పోయే సీట్లే కానీ.. కొత్తగా వచ్చేవేమీ కనిపించడం లేదు. ఈ పరిస్థితికి అధికార వ్యతిరేకత తోడైతే… బీజేపీ వంద సీట్లకు పరిమితం కావడం ఖాయమన్న అంచనాలు వెలువడుతున్నాయి.